
అమెస్టర్‌డామ్: అంతర్జాతీయ టీ20ల్లో మరో కొత్త రికార్డు లిఖించబడింది. థాయ్‌లాండ్ మహిళల క్రికెట్ జట్టు వరుసగా 17వ టీ20 విజయాన్ని నమోదు చేసి నూతన అధ్యాయాన్ని లిఖించింది. క్వాడ్రాంగులర్ సిరీస్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో థాయ్‌లాండ్ ఘన విజయం సాధించడం ద్వారా ఈ ఫీట్‌ను నమోదు చేసింది. తొలుత ఆతిథ్య నెదర్లాండ్స్‌ను 54 పరుగులకే కూల్చిన థాయ్‌లాండ్ మహిళలు.. టార్గెట్‌ను ఎనిమిది ఓవర్లలో ఛేదించారు. ఫలితంగా అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 17వ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పటివరకూ ఆసీస్ మహిళల పేరిట ఉన్న 16 విజయాల రికార్డును థాయ్‌లాండ్ మహిళలు బ్రేక్ చేశారు. 2018 జూలైలో తన టీ20 జైత్రయాత్రను ఆరంభించిన థాయ్‌లాండ్.. ఇప్పటివరకూ ఓటమి లేకుండా దూసుకుపోతోంది. ఈ జాబితాలో థాయ్‌లాండ్, ఆసీస్‌ల తర్వాత స్థానంలో ఇంగ్లండ్ (14 వరుస విజయాలు) ఉంది. పురుషుల క్రికెట్‌లో అఫ్గానిస్తాన్ 11 వరుస విజయాలతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా, పాకిస్తాన్ 9 విజయాలతో రెండో స్థానంలో ఉంది.