‘15 నిమిషాల ఆటలో స్పెషల్‌ ప్లేయర్‌ని చూశా’

Tendulkar Names Australian Batsman Who Resembles Him - Sakshi

సిడ్నీ:  ఫీల్డ్‌లో దిగితే పరుగుల దాహం.. ఒక్కసారి క్రీజ్‌లో కుదురుకుంటే సెంచరీల కోసం ఆరాటం. అతడే లబూషేన్‌. ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు గుండె చప్పుడు. 2018 అక్టోబర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసినా, అతని లైఫ్‌ వచ్చింది మాత్రం గతేడాది యాషెస్‌ సిరీస్‌ అనే చెప్పాలి. యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్టులో స్టీవ్‌ స్మిత్‌ గాయపడటంతో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా  వచ్చి మెరిశాడు. తొలి కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా రికార్డు పుటల్లోకెక్కిన లబూషేన్‌.. అప్పట్నుంచి ఇప్పటివరకూ వెనుదిరిగి చూడలేదు. వరుస పెట్టి సెంచరీలు సాధిస్తూ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. గతేడాది హ్యాట్రిక్‌ టెస్టు సెంచరీలు సాధించిన ఆసీస్‌ ఆటగాడు లబూషేన్‌.. ఈ ఏడాది ఆరంభంలోనే డబుల్‌ సెంచరీ బాదేశాడు. గత నెల్లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ద్విశతకంతో మెరిశాడు. గతేడాది టెస్టుల్లో వెయ్యి పరుగులు సాధించిన ఏకైక ప్లేయర్‌ కూడా లబూషేన్‌ కావడం ఇక్కడ విశేషం. 

అయితే  లబూషేన్‌ ఆటను ఆస్వాదించే ఒకానొక సందర్భంలో అతనిలో తాను కనబడ్డానని భారత దిగ్గజ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌ పేర్కొన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాను కుదిపేసిన కార్చిచ్చు బాధితుల సహాయార్థం నిధుల సేకరణ కోసం తలపెట్టిన ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ ‘బుష్‌ ఫైర్‌ బాష్‌’లో రెండు జట్లలో ఒకదానికి సచిన్‌  కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మీడియా సమావేశంలో సచిన్‌కు ఎదురైన ప్రశ్నకు ఎవరూ ఊహించని లబూషేన్‌ పేరును ప్రస్తావించాడు. ‘ ఇప్పటివరకూ మీ ఆటకు దగ్గరగా ఉన్న ఆటగాడు ఎవరైనా ఉన్నారా’ అన్న ప్రశ్నకు అందుకు లబూషేన్‌ అని సమాధానమిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

‘యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టును నేను చూశా. మా మావయ్యతో కలిసి మ్యాచ్‌ను ఇంట్రెస్ట్‌గా చూస్తున్నా. ఆ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌ గాయం కారణంగా బ్యాటింగ్‌కు రాకపోవడంతో అతని స్థానంలో లబూషేన్‌ ఇన్నింగ్స్‌ను కాస్త ఆసక్తిగానే తిలకించా. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో లబూషేన్‌ ఆడిన రెండో బంతినే హిట్‌ చేశాడు. ఆ మ్యాచ్‌లో లబూషేన్‌ 15 నిమిషాలు ఆడిన తర్వాత లబూషేన్‌లో ఒక స్పెషల్‌ ప్లేయర్‌గా కనబడుతున్నాడనే విషయాన్ని పక్కనున్న మా అంకుల్‌తో అన్నా. అతని ఫుట్‌వర్క్‌ అమోఘం. అదే అతనిలో స్పెషల్‌. ఫుట్‌వర్క్‌ అనేది శరీరానికి సంబంధించినది కాదు. మనసుకు సంబంధించినది. ఫుట్‌వర్క్‌ను కదల్చడంలో పాజిటివ్‌గా ఆలోచించకపోతే, నీ కాలిని ఎటు కదల్చాలో తెలియదు. ఇక్కడ లబూషేన్‌ చక్కటి ఫుట్‌వర్క్‌తో ఉన్నాడు. ఫుట్‌వర్క్‌ విషయంలో నన్ను లబూషేన్‌  గుర్తు చేశాడు’ అని సచిన్‌ పేర్కొన్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top