ఇక నాడా డోప్‌ టెస్టులకు టీమిండియా ఆటగాళ్లు..!

Team India Cricketers Under The Ambit Of The NADA - Sakshi

స్పష్టం చేసిన క్రీడా మంత్రిత్వశాఖ

ఆటగాళ్లందరూ సమానమేనని స్పష్టీకరణ

నాడా పరిదిలోకి బీసీసీఐ ఆటగాళ్లు

న్యూఢిల్లీ : భారత క్రికెటర్లు ఇక నాడా (నేషనల్‌ యాంటి డోపింగ్‌ ఏజన్సీ) డోపింగ్‌ టెస్టుల్లో పాల్గొనాల్సిందేనని క్రీడా మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఆటగాళ్లందరూ సమానమేనని, ఈ విషయంలో క్రికెటర్లకు ఎలాంటి మినహాయింపులు ఉండవని క్రీడాశాఖ కార్యదర్శి ఆర్‌ఎస్‌ జులానియా వెల్లడించారు. ఇక ఈ నిర్ణయంతో టీమిండియా ఆటగాళ్లు నాడా పరిధిలోకి రానున్నారు. అయితే, నాడా పనితీరుపై బీసీసీఐకి అభ్యంతరాలు ఉన్నాయి. అందుకనే బోర్డే తన ఆటగాళ్లకు ఇన్నాళ్లూ డోప్‌ టెస్టులు నిర్వహిస్తూ వస్తోంది. 

ఇదిలాఉండగా.. ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలో ఉన్న టెర్బుటలైన్‌ ఉత్ప్రేరకాన్ని వాడిన యువ క్రికెటర్‌ పృథ్వీ షా 8 నెలల నిషేదానికి గురైన సంగతి తెలిసిందే. అవగాహన లేకే టెర్బుటలైన్‌ మెడిసిన్‌ తీసుకున్నట్లు పృథ్వీ బీసీసీఐకి వివరణ ఇచ్చాడు. కావాలని కాకుండా మెడిసిన్‌గా తీసుకోవడంతో బోర్డు కరుణించి అతనికి తక్కువ శిక్ష విధించింది. ఇక  డోప్ టెస్ట్‌లు, శిక్షలు ఖరారు చేయడం పరస్పర విరుద్ధ ప్రయోజనం కిందకు వస్తుందని కేంద్ర క్రీడల శాఖ ఇటీవల బీసీసీఐకి లేఖ రాసింది. అంతర్జాతీయ డోపింగ్‌ వ్యతిరేక ఏజెన్సీ గుర్తించిన సంస్థ ద్వారానే డోప్‌ టెస్ట్‌లు నిర్వహించాలని బోర్డుకు సూచించింది.
(చదవండి : డోప్‌ టెస్టులో పృథ్వీ షా  విఫలం)

అయితే, బీసీసీఐ మాత్రం తమ డోపింగ్‌ టెస్టులు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో జరుగుతున్నాయన్న పేర్కొనడం విశేషం. ఇక క్రీడాశాఖ స్ప‌ష్ట‌మైన ఆదేశాల నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు నాడా డోపింగ్‌ పరీక్షల్లో పాల్గొనాల్సిందే. నాడా పనితీరుపై అనుమానాలు ఉన్నాయని బీసీసీఐ యాంటి డోపింగ్‌ మేనేజర్‌ అభిజిత్‌ సాల్వి అన్నారు. అందుకనే బీసీసీఐ ఆందోళన చెందుతోందని చెప్పారు. ఆ సంస్థ పేలవ పనితీరు ఫలితంగా ఎంతమంది ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top