ప్రేక్షకుల కోసం కొత్తగా... | T20 international match | Sakshi
Sakshi News home page

ప్రేక్షకుల కోసం కొత్తగా...

Jul 18 2015 12:26 AM | Updated on Sep 3 2017 5:41 AM

ప్రేక్షకుల కోసం కొత్తగా...

ప్రేక్షకుల కోసం కొత్తగా...

భారత్ తొలిసారిగా టి20 ప్రపంచకప్‌కు వచ్చే ఏడాది మార్చిలో ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మెగా టోర్నీ నిర్వహణ బాధ్యత తెలుగు వ్యక్తి మాటూరు వెంకట శ్రీధర్‌కు దక్కింది.

టి20 ప్రపంచకప్‌తో వినోదం లభిస్తుంది
 టోర్నీ డెరైక్టర్ ఎం.వి. శ్రీధర్

 
 సాక్షి, హైదరాబాద్: భారత్ తొలిసారిగా టి20 ప్రపంచకప్‌కు వచ్చే ఏడాది మార్చిలో ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మెగా టోర్నీ నిర్వహణ బాధ్యత తెలుగు వ్యక్తి మాటూరు వెంకట శ్రీధర్‌కు దక్కింది. ప్రస్తుతం బీసీసీఐలో జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్)గా పని చేస్తున్న ఎంవీ శ్రీధర్‌ను 2016 టి20 ప్రపంచకప్ టోర్నమెంట్ డెరైక్టర్‌గా ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ టోర్నీకి కర్త, కర్మ, క్రియలాంటి పదవి తనకు దక్కడ ం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గత టోర్నీలకు భిన్నంగా ప్రేక్షకుల కోసం కొత్తగా వినోదాన్ని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఆయన చెప్పారు. శ్రీధర్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా చెప్పిన ఇతర అంశాలు ఆయన మాటల్లోనే...
 
 ఊహించలేదు: బీసీసీఐ నాపై నమ్మకముంచి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించింది. కానీ ప్రపంచకప్ డెరైక్టర్‌గా ఎంపికవుతానని ఎప్పుడూ ఊహించలేదు. ఇప్పటికే ఆపరేషన్స్ మేనేజర్‌గా భారత జట్టు ఆడే మ్యాచ్‌లు, దేశవాళీ మ్యాచ్‌ల ఏర్పాట్లతో పాటు ఐసీసీకి సంబంధించిన బాధ్యతలు కూడా పర్యవేక్షిస్తున్నాను. ఒక రకంగా దానికి ఇది పొడిగింపులాంటిదే అని భావిస్తున్నాను.
 చిత్తశుద్దితో నిర్వహిస్తా: టోర్నీ డెరైక్టర్ అంటే ప్రతి చిన్నా, పెద్దా విషయాలు చూసుకోవాలి. మంచికీ, చెడుకూ నేరుగా బాధ్యత వహించాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా, చిత్తుశుద్దితో బాధ్యత నిర్వహిస్తా. ఇదొక సవాల్ లాంటిదే.
 
 కొత్త అనుభూతి కోసం: టి20కి మన దేశంలో చాలా క్రేజ్ ఉంది. తొలి చాంపియన్స్ మనమే అయినా ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. కాబట్టి విదేశాల నుంచి వచ్చే ప్రేక్షకులు, క్రికెటర్లు అందరూ సంతోషంగా వెళ్లేలా చూస్తాం. ఐపీఎల్ వల్ల మన ప్రేక్షకులకు టి20 వినోదం కొత్త కాదు. కాబట్టి ప్రపంచకప్ అనగానే అందరి వైపు నుంచి అంచనాలు భారీగా ఉంటాయి. అందుకే ప్రేక్షకుల కోసం కొత్తగా ఏదైనా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తాం.
 
 కృతజ్ఞతలు: అభిమాని ఆనందమే ఏ టోర్నీలో అయినా అసలు విజయం. కాబట్టి ప్రపంచకప్‌ను కచ్చితంగా గొప్పగా నిర్వహిస్తామని హామీ ఇస్తున్నాను. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన బీసీసీఐతో పాటు హైదరాబాద్ క్రికెట్ సంఘం, నా సహచరులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement