'భజ్జీ అంటే భయపడిపోయేవారు'

Suresh Raina On Indian Cricketer Whom Australia Feared Most - Sakshi

ముంబై : కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ చాట్‌ నిర్వహిస్తూ పాత విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా టీమిండియా ఆటగాడు సురేశ్‌ రైనా, మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌లు ఇన్‌స్టా లైవ్‌ చాట్‌లో‌ మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా టీమిండియా వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ పేరు వింటే చాలు ఆస్ట్రేలియా జట్టు భయపడేదంటూ సురేశ్‌ రైనా పేర్కొన్నాడు. (ఆటకు వీడ్కోలు పలికేది అప్పుడే: రోహిత్‌)

'ప్రపంచ క్రికెట్‌లో భజ్జీ స్థానం ఎప్పటికి అలాగే ఉండిపోతుంది. ఆఫ్‌ స్పిన్నర్‌గా తన ప్రస్థానం ప్రారంభించిన బజ్జీ ప్రపంచంలో ఒక బెస్ట్‌ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. భారత తరపున వంద టెస్టు మ్యాచ్‌లు ఆడిన అతి కొద్ది మందిలో హర్భజన్‌ కూడా ఉన్నాడు. అలాంటి హర్భజన్‌ పేరు వింటే ఆస్ట్రేలియా ఆటగాళ్లు చెవులు మూసుకునేవారంటూ ' ఇర్ఫాన్‌ పఠాన్‌ తెలిపాడు. దీనికి రైనా స్పందిస్తూ' అవును నువ్వు చెప్పింది నిజమే.. ఆస్ట్రేలియాతో ఆడేటప్పడు హర్భజన్‌ ఒక ఫైటర్‌లా కనిపిస్తాడు. వారిపై మన జట్టును ఎన్నోసార్లు గెలిపించాడు. అందుకేనేమో హర్బజన్‌కు దూరంగా ఉండాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లు భావిస్తారంటూ' చెప్పుకొచ్చాడు. 2007-08లో ఆసీస్‌ పర్యటనలో హర్భజన్‌- ఆండ్రూ సైమండ్స్‌ల మధ్య జరిగిన మంకీ గేట్‌ వివాదాన్ని ఈ సందర్భంగా ఇర్ఫాన్ మరోసారి‌ గుర్తు చేసుకున్నాడు. ఆ సిరీస్‌లో భజ్జీతో కలిసి ఆడేటప్పుడు ఎప్పుడు ఒక విషయం ఎప్పుడు చెబుతుండేవాడు. 'నేను హర్భజన్‌ సింగ్‌లా కాక ఒక మైకెల్‌ జాక్సన్‌లా ఫీలవుతానని' అంటుండేవాడు. మంకీగేట్‌ ఉదంతం తర్వాత అక్కడి మీడియాలో స్టార్‌గా మారిపోవడంతో అతను ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లిపోయేవారంటూ ఇర్ఫాన్‌ పేర్కొన్నాడు. (బీసీసీఐ సెలక్టర్లపై ఇర్ఫాన్‌ తీవ్ర విమర్శలు)

2016లో చివరి టీ20 ఆడిన హర్భజన్‌ సింగ్‌ ఇప్పటికి టెస్టుల్లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన యాక్టివ్‌ బౌలర్‌గా ఉన్నాడు. మొత్తం 103 టెస్టుల్లో 417 వికెట్లు తీసిన హర్భజన్‌కు ఆస్ట్రేలియాపై ఘనమైన రికార్డు ఉంది. ఆస్ట్రేలియాపై 18 టెస్టుల్లో ఆడిన భజ్జీ 29.95 సగటుతో 95 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాపై టెస్టుల్లో హ్యాట్రిక్‌ తీసిన బౌలర్‌గా హర్భజన్‌ నిలిచాడు. భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన 2001ఈడెన్‌ గార్డెన్‌ టెస్టులో బజ్జీ ఈ ఫీట్‌ సాధించడం విశేషం.  ఈ సిరీస్‌లో 17.03 సగటుతో మొత్తం 32 వికెట్లు సాధించిన భజ్జీకి ఈ సిరీస్‌ ఒక టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. కాగా హర్భజన్‌ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top