మరో అకాడమీ కోసం గోపీచంద్‌ భూమిపూజ

Stage set for global badminton centre in Telanga State - Sakshi

కొటక్‌ మహీంద్రతో కలిసి నిర్మాణం ∙పూజలో పాల్గొన్న గవర్నర్‌ నరసింహన్‌  

సాక్షి, హైదరాబాద్‌: బ్యాడ్మింటన్‌ క్రీడలో దేశానికి పేరు తెచ్చిన క్రీడాకారులను తీర్చిదిద్దిన పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ ఫౌండేషన్‌ మరో అకాడమీ నిర్మాణానికి పూనుకుంది. కొటక్‌ మహీంద్ర బ్యాంక్‌ లిమిటెడ్‌తో కలిసి సంయుక్తంగా పీజీబీఏ ప్రాంగణంలోనే మరో అకాడమీని నెలకొల్పనుంది. ఈ మేరకు బుధవారం పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ ప్రాంగణంలో భూమి పూజ చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. తెలంగాణ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌ కూడా పూజలో పాల్గొన్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) ప్రోగ్రామ్‌లో భాగంగా గోపీచంద్‌ అకాడమీతో కొటక్‌ మహీంద్ర బ్యాంక్‌ జతకట్టింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకోనున్న ఈ అకాడమీలో 6 ఏసీ కోర్టులు, స్పోర్ట్స్‌ సైన్స్‌ సెంటర్‌ ఉండనున్నాయి.

ఈ సందర్భంగా భారత జట్టు చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ మాట్లాడుతూ క్రీడాకారుల ఉన్నతి కోసం నూతన అకాడమీ నిర్మాణానికి కొటక్‌ మహీంద్ర బ్యాంక్‌ ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచస్థాయి ఆటగాళ్లుగా ఎదగాలంటే ఆటపట్ల ఇష్టం, అంకితభావం, నిరంతర శిక్షణతో పాటు తగిన మౌలిక సదుపాయాలు కూడా అవసరమని అన్నారు. ‘కొటక్‌ మహీంద్ర ప్రోత్సాహంతో అకాడమీలో ప్రపంచ స్థాయి సదుపాయాలు సమకూరనున్నాయి. ఇది చాంపియన్‌ క్రీడాకారుల క్రీడా ప్రమాణాలను మరింతగా పెంచుతుంది. ఏసీ కోర్టుల్లో ప్రాక్టీస్‌ వారికి ప్రపంచస్థాయి వేదికల్లో పోరాటాలను తేలిక చేస్తుంది. ఎందుకంటే చాలావరకు మెగా ఈవెంట్స్‌ అన్నీ ఏసీ కోర్టుల్లోనే జరుగుతాయి. ఇక్కడ ప్రాక్టీస్‌ నుంచే ఏసీ కోర్టులు అందుబాటులో ఉండటం ఆటగాళ్లకు మేలు చేస్తుంది’ అని వివరించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top