ఎదురులేని సన్‌రైజర్స్‌ | SRH beat Delhi Daredevils by 7 wickets | Sakshi
Sakshi News home page

ఎదురులేని సన్‌రైజర్స్‌

May 5 2018 11:37 PM | Updated on May 6 2018 9:17 AM

SRH beat Delhi Daredevils by 7 wickets - Sakshi

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జోరు కొనసాగుతోంది. శనివారం ఇక్కడ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా తమకు ఎదురులేదని మరోసారి నిరూపించింది సన్‌రైజర్స్‌. సీజన్‌ ఆరంభంలో హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకుపోయిన సన్‌రైజర్స్‌.. మరొకసారి వరుసగా నాల్గో గెలుపును అందుకుంది. ఓవరాల్‌గా 9 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్‌ ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌ను ఆక్రమించింది. అదే సమయంలో ప్లే ఆఫ్‌ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది.

తాజా మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ కు ఢిల్లీ 164 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్‌కు శుభారంభం లభించింది. అలెక్స్‌ హేల్స్‌(45;31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), శిఖర్‌ ధావన్‌(33; 30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) మంచి ఆరంభాన్నివ్వగా,  మిగతా పనిని మనీష్‌ పాండే(21), కేన్‌ విలియమ్సన్‌(32 నాటౌట్‌),  యూసఫ్‌ పఠాన్‌(27 నాటౌట్‌)లు పూర్తి చేశారు.


అంతకుముందు ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన మ్యాక్స్‌వెల్‌(2) రనౌట్‌ కావడంతో ఢిల్లీ తొమ్మిది పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ సమయంలో పృథ్వీ షా-శ్రేయస్‌ అయ్యర్‌ల జోడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ప్రధానంగా పృథ్వీ షా చెలరేగి ఆడాడు. ఈ క్రమంలోనే 25 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ సాధించాడు.

కాగా, పృథ్వీ షా(65;36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో.. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో సిద్దార్థ్‌ కౌల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దాంతో 95 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్‌ను నష్టపోయింది. పృథ్వీ షా ఔటైన తర్వాత స్కోరు బోర్డు నెమ్మదించింది. దాంతో స్కోరును పెంచే క్రమంలో భారీ షాట్‌కు యత్నించి శ్రేయస్‌ అయ్యర్‌(44;36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా ఔటయ్యాడు. ఆపై పరుగు వ్యవధిలో నమాన్‌ ఓజా(1), రిషబ్‌ పంత్‌(18)లు పెవిలియన్‌ చేరడంతో ఢిల్లీ స్కోరు మరింత మందగించింది. చివర్లో విజయ్‌ శంకర్‌(23 నాటౌట్‌; 13 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్పర్‌) బ్యాట్‌ ఝుళిపించడంతో ఢిల్లీ గౌరవప‍్రదమైన స్కోరును సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement