ఆరోగ్యానికి క్రీడల ద్వారా లభించే వ్యాయామమూ అంతే అవసరమని జాతీయ మాజీ వాలీబాల్ క్రీడాకారుడు, సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ జి.కిరణ్‌రెడ్డి అన్నారు.
సాక్షి, హైదరాబాద్: మానసిక ఎదుగుదలకు, వికాసానికి విద్య ఎంత అవసరమో... శారీరక దృఢత్వానికి, ఆరోగ్యానికి క్రీడల ద్వారా లభించే వ్యాయామమూ అంతే అవసరమని జాతీయ మాజీ వాలీబాల్ క్రీడాకారుడు, సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ జి.కిరణ్‌రెడ్డి అన్నారు. విద్యాజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వార్షికోత్సవ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, అథ్లెటిక్స్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా కిరణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరి జీవితంలో క్రీడలు భాగం కావాలని కోరారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న శక్తిని ఆటల ద్వారా చైతన్యవంతం చేస్తే, వారు క్రమశిక్షణ గల పౌరులుగా ఎదుగుతారన్నారు. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకుని లక్ష్యసాధన దిశగా అడుగులు వేసేందుకు క్రీడలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి, సినీ గీత రచయిత అనంత శ్రీరామ్, వీజేఐటీ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ పద్మజ పాల్గొన్నారు.