దక్షిణాఫ్రికా ‘ఎ’ 246/8 

South Africa 'A'  team 246/8 - Sakshi

బెంగళూరు: బౌలర్లు సమష్టిగా రాణించడంతో దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతోన్న తొలి అనధికారిక టెస్టులో భారత్‌ ‘ఎ’ ప్రత్యర్థి జట్టును కట్టడి చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా ‘ఎ’ 88 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. రూడీ సెకండ్‌ (94; 12 ఫోర్లు) త్రుటిలో సెంచరీని కోల్పోయాడు. హైదరాబాదీ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ (3/56) ఆకట్టుకున్నాడు. శనివారం ఇక్కడ ప్రారంభమైన ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ ఎంచుకోగా... సిరాజ్‌ చెలరేగడంతో ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. పీటర్‌ మలాన్‌ (7), జుబేర్‌ హమ్జా (0)లను పెవిలియన్‌ చేర్చడంతో ఆ జట్టు 20 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో సరెల్‌ ఇర్వీ (47; 7 ఫోర్లు) నిలబడ్డాడు. కెప్టెన్‌ ఖాయా జోండో (24), సెనురాన్‌ ముత్తుస్వామి (23)లతో కలిసి కొన్ని పరుగులు జతచేశాడు. అనంతరం రూడీ సెకండ్‌ ఒంటరి పోరాటం చేస్తూ జట్టును ఓ మోస్తరు స్కోరుకు చేర్చాడు.  భారత బౌలర్లలో సిరాజ్‌తో పాటు పేసర్లు నవ్‌దీప్‌ సైనీ (2/47), రజనీశ్‌ గుర్బానీ (2/47) రాణించారు. ఈ మ్యాచ్‌లో ఆంధ్ర రంజీ క్రికెటర్లు కోన శ్రీకర్‌ భరత్, హనుమ విహారి భారత తుది జట్టులో ఉన్నారు. వికెట్‌ కీపర్‌ భరత్‌ నాలుగు క్యాచ్‌లు, విహారి ఒక క్యాచ్‌ తీసుకోవడం విశేషం.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top