అప్పుడు కుంబ్లేను కోహ్లి వద్దన‍్నాడు.. ఇప్పుడైతే?

Sourav Would Have Thrust Kumble Down Virat's throat Vinod Rai - Sakshi

న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్ల క్రితం టీమిండియా ప్రధాన కోచ్‌ పదవి నుంచి అనిల్‌ కుంబ్లే తప్పుకోవడానికి కారణాలను బీసీసీఐ కమిటీ పరిపాలక కమిటీ(సీఓఏ) మాజీ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ వెల్లడించారు. ఆరోజు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో విభేదాలు కారణంగానే కుంబ్లే తన పదవిని అర్థాంతరంగా వదులుకోవాల్సి వచ్చిందన్నారు. బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ పగ్గాలు చేపట్టడంతో సీఓఏ పదవీ కాలం ముగిసింది.  ఈ మేరకు సీఓఏకు 33 నెలలుగా చీఫ్‌గా ఉన్న వినోద్‌ రాయ్‌ తన అనుభవాలను పంచుకున్నాడు. దీనిలో భాగంగా కోహ్లి-కుంబ్లేల వివాదాన్ని మరోసారి మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు. ‘  కుంబ్లే ఒక అద్భుతమైన కోచ్‌. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ నా పరిధిలో కుంబ్లే పదవి కాలాన్ని పొడిగించే అవకాశం ఉంటే దాన్ని కచ్చితంగా అమలు చేసేవాడ్ని. కుంబ్లే చాలా మర్యాదగల వ్యక్తి.

కానీ కోహ్లితో విభేదాలు తర్వాత కుంబ్లేను కొనసాగించే అవకాశం నా చేతుల్లో లేదు. అది క్రికెట్‌ సలహా కమిటీ(సీఏసీ) నిర్ణయం. కుంబ్లేతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోహ్లికి అభిప్రాయ బేధాలు తలెత్తడంతో ఉన్నపళంగా కోచ్‌ను మార్చాల్సి వచ్చింది. సీఏసీలో సభ్యులైన సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీలతో కోహ్లి సుదీర్ఘ చర్చల తర్వాత కోచ్‌ను మార్చాలని పట్టుబట్టడంతో కుంబ్లేకు ఉద్వాసన తప్పలేదు. ఇక్కడ విషయం చెప్పాలి. కోహ్లి వైఖరితో కుంబ్లేనే స్వచ్ఛందంగా తన పదవి నుంచి తప్పుకున్నాడు. వివాదాన్ని మరింత పెద్దది చేయకుండా కుంబ్లే చాలా గౌరవంగా తన పదవికి గుడ్‌ బై చెప్పాడు. ఆ సమయంలో కోహ్లి ముంబైలో ఉండగా, నేను హైదరాబాద్‌లో ఉన్నా. ఫోన్‌ ద్వారా కోహ్లి అంతరంగాన్ని తెలుసుకున్నా. ఇదే విషయాన్ని సచిన్‌కు చెప్పా.

కుంబ్లేను కొనసాగించడానికి కోహ్లి ఆసక్తిగా లేడనే విషయాన్ని చెప్పా. అప్పుడు సచిన్‌, సౌరవ్‌లు కోహ్లితో మాట్లాడారు. ఆ క్రమంలోనే కుంబ్లే పదవి నుంచి తప్పుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో కుంబ్లేను కోచ్‌గా కొనసాగించే అవకాశం నా చేతుల్లో లేదు. ఒకవేళ ఉండి ఉంటే కచ్చితంగా కుంబ్లేను కోచ్‌గా కొనసాగించేవాడిని. అదే వివాదం ఈరోజు తలెత్తి ఉంటే పరిస్థితి మరొక రకంగా ఉండేది. కుంబ్లేను బలవంతంగానైనా ఆ పదవిలో గంగూలీ కొనసాగించే వాడు. ఈ తరహా వివాదమే టీమిండియా మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌కు కోచ్‌గా పనిచేసిన రమేశ్‌ పవార్‌కు మధ్య జరిగింది. ఇవన్నీ ప్రజల్లో అపవాదను తెచ్చిపెట్టడమే కాకుండా మరింత వివాదాన్ని రాజేశాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ రావడంతో ఆనాటి పరిస్థితులు ఇక ఉండవనే అనుకుంటున్నా. గంగూలీ ఏ విషయాన్నైనా డీల్‌ చేయగల సమర్థుడు’ అని వినోద్‌ రాయ్‌ పేర్కొన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top