ధోని.. ఇదేనా నీ బ్యాటింగ్‌?

Sourav Ganguly slam MS Dhoni over lack of intent - Sakshi

బర్మింగ్‌హామ్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ప్రస్తుత వరల్డ్‌కప్‌లో తన ప్రదర్శనతో మరోసారి విమర్శల పాలవుతున్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని జిడ్డుగా బ్యాటింగ్‌ చేయడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో ధోనికి మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ మద్దతుగా నిలిచాడు. అతను స్టైక్‌రేట్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రపంచకప్‌లో ధోనినే హీరో అంటూ గంగూలీ అండగా నిలబడ్డాడు. అయితే  ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్‌ను కామెంటరీ బాక్స్‌ నుంచి వీక్షించిన గంగూలీ పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. అసలు ఇదేం బ్యాటింగ్‌ అంటూ మండిపడ్డాడు.(ఇక్కడ చదవండి: ప్రపంచకప్‌ హీరో అతడే)

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఓటమి దిశగా సాగుతున్న సందర్భంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నార్ హుస్సేన్, గంగూలీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తాను పూర్తిగా తికమకకు గురయ్యానని, ఏం జరుగుతుందో తెలియడం లేదని నాసీర్‌ హుస్సేన్‌ వ్యాఖ్యానించాడు. టీమిండియాకు కావాల్సింది ఇది కాదని, వాళ్లకు మరిన్ని రన్స్ అవసరమని చెప్పాడు. అలాంటి సందర్భంలో క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్స్ ఏం చేస్తున్నారని ప్రశ్నించాడు. కొంతమంది ఇండియన్ ఫ్యాన్స్ ఇప్పటికే వెళ్లిపోతున్నారని, ధోని నుంచి వాళ్లు ఈ ఆటతీరును ఆశించలేదని, ధోని మార్క్ షాట్స్ ఆశించారని ఈ సందర్భంగా ప్రస్తావించాడు.

ఈ వ్యాఖ్యలపై గంగూలీ స్పందిస్తూ.. ఈ ఆటతీరు గురించి చెప్పడానికి తన దగ్గర ఎలాంటి వివరణ లేదన్నాడు. ప్రధానంగా క్రీజ్‌లో ఉన్న ధోని-జాదవ్‌లు సింగిల్స్‌ గురించి తన దగ్గర సమాధానం లేదన్నాడు. ఐదు వికెట్లు చేతిలో ఉండగా 338 పరుగులు చేయలేని స్థితిలో భారత బ్యాట్స్‌మెన్స్ ఉన్నారని గంగూలీ దుయ్యబట్టాడు. ఎంఎస్ ధోని సింగిల్స్ తీస్తూ స్లోగా బ్యాటింగ్ చేయడంపై సౌరవ్ పరోక్ష విమర్శలు చేశాడు. టీమిండియా 300 పరుగులకు ఆలౌట్ అయినా తాను బాధపడేవాడిని కాదని, కానీ 5వికెట్లు చేతిలో ఉండగా కూడా ఇలా ఆడటమేంటని గంగూలీ విమర్శించాడు.


 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top