వేటు పడింది

Smith, Warner banned for one year, Bancroft for nine months - Sakshi

స్మిత్, వార్నర్‌లపై ఏడాది నిషేధం

బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలు

క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటన

అంతా ఊహించిందే జరిగింది. బాల్‌ ట్యాంపరింగ్‌ దుశ్చర్య స్టీవ్‌ స్మిత్, డేవిడ్‌ వార్నర్, కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ల కెరీర్‌కు చుట్టుకుంది. ఈ ఘటనలో వీరిని దోషులుగా తేల్చిన క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)... బుధవారం చర్యలను ప్రకటించింది. స్మిత్,వార్నర్‌లపై 12 నెలలు, బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది. ఆ తర్వాత స్మిత్‌ మరో ఏడాది పాటు కెప్టెన్సీ చేపట్టేందుకూ వీల్లేకుండా,వార్నర్‌ను శాశ్వతంగా కెప్టెన్, వైస్‌ కెప్టెన్‌ పదవులకు అనర్హుడిగా పేర్కొంటూ ఆదేశాలిచ్చింది. స్మిత్‌ ఇప్పటికే ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాజస్తాన్‌ రాయల్స్‌ సారథ్యం వదులుకోగా...సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తప్పుకొన్నాడు. నిషేధంపై వీరు ముగ్గురు అప్పీల్‌ చేసుకునేందుకు వారం గడువు ఇచ్చారు. దక్షిణాఫ్రికాతో చివరిదైన నాలుగో టెస్టులో వీరి స్థానాలను ఓపెనర్లు జో బర్న్స్, మ్యాట్‌ రెన్‌షా, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ మ్యాక్స్‌వెల్‌ భర్తీ చేయనున్నారు. వికెట్‌ కీపర్‌ టిమ్‌ పైన్‌ సారథ్యం వహించనున్నాడు.

సిడ్నీ: తమ ప్రవర్తనా నియమావళిలోని 2.3.5 నిబంధనలను అతిక్రమించినందుకు ముగ్గురు ఆటగాళ్లపై తగిన చర్యలు తీసుకున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. దీనిప్రకారం స్టీవ్‌ స్మిత్, డేవిడ్‌ వార్నర్‌లు ఏడాది పాటు, బాన్‌క్రాఫ్ట్‌ 9 నెలలు అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది. దీంతోపాటు వంద గంటల పాటు స్వచ్ఛంద సేవ చేయాలని సూచించింది. అయితే... క్రికెట్‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోకుండా వీరు క్లబ్‌ క్రికెట్‌ ఆడుకునేందుకు అనుమతించింది. నిషేధం ముగిసిన 12 నెలల అనంతరం కూడా స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లను కెప్టెన్సీకి పరిగణనలోకి తీసుకోమని సీఏ పేర్కొంది. ఆ తర్వాత బాధ్యతలు అప్పగించే విషయం ఇతర ఆటగాళ్లు, అభిమానుల అభిప్రాయాల మేరకు ఉంటుందని వివరించింది. వార్నర్‌కు భవిష్యత్‌లో ఎప్పటికీ సారథ్యం దక్కదని స్పష్టం చేసింది.

అసలేం జరుగుతోంది?
బాన్‌క్రాఫ్ట్‌ బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడుతుండటాన్ని తెరపై చూసిన కోచ్‌ డారెన్‌ లీమన్‌... వాకీటాకీలో హ్యాండ్స్‌కోంబ్‌తో ఏమని మాట్లాడాడో క్రికెట్‌ ఆస్ట్రేలియా చీఫ్‌ జేమ్స్‌ సదర్లాండ్‌ వెల్లడించారు. ఆ సందర్భంగా లీమన్‌... ‘ఏం జరుగుతోంది అక్కడ?’ అంటూ హ్యాండ్స్‌కోంబ్‌ను ప్రశ్నించాడని సదర్లాండ్‌ తెలిపారు. టీ విరామంలో డ్రెస్సింగ్‌ రూమ్‌కు వచ్చిన ఆటగాళ్లనూ అతడు ఇదే ప్రశ్న అడిగాడని వివరించారు. విచారణ నివేదికలోనూ ఇదే విషయం ఉండటంతో ట్యాంపరింగ్‌లో లీమన్‌ పాత్ర ఏమీ లేదని స్పష్టమైంది. ఈ కారణంగానే అతడిపై చర్యలకు అవకాశం లేకుండా పోయింది.
 
క్రికెట్‌కు  జెంటిల్‌మన్‌ గేమ్‌గా గుర్తింపు ఉంది. నిజాయతీగా ఆడాలని నేను నమ్ముతాను. జరిగిన ఘటన దురదృష్టకరం. అయితే క్రికెట్‌ సమగ్రతను కాపాడేందుకు సరైన నిర్ణయమే తీసుకున్నారు. గెలవడం ముఖ్యమే కానీ ఎలా గెలిచారనేది కూడా అంతకంటే ముఖ్యం.
–సచిన్‌ టెండూల్కర్‌

అన్ని కోణాల్లో విచారించాం. తప్పు చేసిన ఆటగాళ్లకు ఈ శిక్షలు సరైనవే. క్రికెట్‌ కీర్తి, స్ఫూర్తి నిలిపేందుకు తీసుకున్న ఈ చర్యలతో నేను సంతృప్తి చెందాను. దీని నుంచి అందరూ పాఠాలు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. మా పురుషుల జట్టులోని సంస్కృతి, ఆటగాళ్ల ప్రవర్తన స్వీయ సమీక్ష చేసుకుంటాం.
– సీఏ సీఈవో జేమ్స్‌ సదర్లాండ్‌

భావోద్వేగాలను కాస్త పక్కనపెట్టి ఆలోచిద్దాం. అవసరం లేకపోయినా ఒకరిని నష్టపరచడం సరైంది కాదు. వారు చేసిన చర్యను సమర్థించుకోలేరు. కానీ ఏడాది నిషేధం అనేది సరైంది కాదు. నా దృష్టిలో ఒక టెస్టు నిషేధం, కెప్టెన్, వైస్‌ కెప్టెన్‌ పదవులనుంచి ఉద్వాసన, భారీ జరిమానాలే సరైన శిక్ష. ఆ తర్వాత వారు ఆడేందుకు అనుమతించాల్సింది.        
– షేన్‌వార్న్‌

ఐపీఎల్‌ నుంచీ తప్పించారు...
న్యూఢిల్లీ: తమ ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్, వార్నర్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాది నిషేధం విధించిన నేపథ్యంలో బీసీసీఐ కూడా స్పందించింది. వారిని ఈ ఐపీఎల్‌ సీజన్‌కు దూరం పెడుతూ నిర్ణయం తీసుకుంది. లీగ్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా బుధవారం ఈ మేరకు మీడియాకు తెలిపారు. ‘మొదట ఐసీసీ నిర్ణయం కోసం వేచి చూశాం. తర్వాత సీఏ ఏం చర్యలు తీసుకుంటుందో గమనించాం. ఇప్పుడు మా వంతుగా ఆలోచించి దీనిని ప్రకటించాం. వీరి స్థానాలను భర్తీ చేసుకునే అవకాశం ఫ్రాంచైజీలకు ఉంది’ అని ఆయన వివరించారు. మరోవైపు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్ష, కార్యదర్శులు సీకే ఖన్నా, అమితాబ్‌ చౌధరి, ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లాలతో సంప్రదించిన తర్వాత స్మిత్, వార్నర్‌లను లీగ్‌ నుంచి పక్కనపెట్టినట్లు సీఓఏ పేర్కొంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top