ఆరు బీర్లు తాగినట్లు ఉందని చెప్పా: స్మిత్‌

Smith Reminded Of Phillip Hughes tragedy - Sakshi

లండన్‌: యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇక‍్కడ జరిగిన రెండో టెస్టులో ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ వేసిన అత్యంత వేగవంతమైన బౌన్సర్‌ను తప్పించుకునే క‍్రమంలో స్మిత్‌ గాయపడ్డాడు. బంతి మెడకు తగలడంతో స్మిత్‌ అక్కడికక్కడే కూలబడిపోయాడు. అయితే తనకు గాయమైన మరుక్షణం ఫిలిప్ హ్యూస్ విషాదం కళ్లముందు కదలాడిందని స్మిత్‌ తాజాగా చెప్పుకొచ్చాడు.  'బంతి తగలగానే నా మెదుడులో కొన్ని విషయాలు పరుగెత్తాయి. ముఖ్యంగా నాకు ఎక్కడ గాయం అయింది అని కంగారుపడ్డా. ఆ సమయంలో ఫిలిప్ హ్యూస్ విషాదం గుర్తుకు వచ్చింది. అప్పుడు ఏం జరిగిందో అందరికి తెలుసు. దీంతో కొంత ఆందోళనకు గురయ్యా. కొద్ది సమయం తర్వాత నేను బాగానే ఉన్నాను. ఇక మధ్యాహ్నం అంతా మానసికంగా కూడా బాగానే ఉన్నాను' అని స్మిత్ తెలిపాడు.

'మొదటి ఇన్నింగ్స్‌లో గాయపడిన తర్వాత రెండోసారి బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఎలాంటి అసౌకర్యం కలగలేదు. అయితే సాయంత్రం డాక్టర్ వచ్చి ఎలా ఉంది అని అడిగినపుడు మాత్రం గత రాత్రి ఆరు బీర్లు తాగిన ఫీలింగ్ ఉంది అని చెప్పా. అపుడు నాకు అలాగే అనిపించింది. మరో రెండు రోజులు కూడా అలాగే ఉంది. కొన్ని ఘటనలు ఆలా జరుగుతాయి. ఏదేమైనా మంచి టెస్ట్ మ్యాచ్ మిస్ అయ్యా' అని స్మిత్ పేర్కొన్నాడు. అయితే తనకు ఆర్చరే ప్రధాన ప్రత్యర్థి అని పలువురి విశ్లేషించిన నేపథ్యంలో స్మిత్‌ స‍్పందించాడు. నాకు ఆర్చర్‌ ఒక్కడే టార్గెట్‌ కాదు.  నన్ను ఔట్‌ చేయడంలో చాలా మంది ఇంగ్లిష్‌ బౌలర్లు సక్సెస్‌ అయ్యారు. నేను గాయపడ్డ టెస్టులో కూడా ఆర్చర్‌కు వికెట్‌ ఏమీ ఇవ్వలేదు కదా’ అని స్మిత్‌ బదులిచ్చాడు. గాయం కారణంగా మూడో టెస్టుకు దూరమైన స్మిత్‌.. నాల్గో టెస్టుకు స్మిత్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top