మా కెప్టెన్‌కు బుద్ధి లేదు : అక్తర్‌ ఫైర్‌ | Shoaib Akhtar Slams Brainless Captain Sarfaraz Ahmed | Sakshi
Sakshi News home page

మా కెప్టెన్‌కు బుద్ధి లేదు : అక్తర్‌ ఫైర్‌

Published Mon, Jun 17 2019 1:23 PM | Last Updated on Mon, Jun 17 2019 2:32 PM

Shoaib Akhtar Slams Brainless Captain Sarfaraz Ahmed - Sakshi

చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు చేసిన తప్పునే నిన్న పాకిస్తాన్‌ జట్టు చేసింది. సర్ఫరాజ్‌ ఇంత తెలివి తక్కువ పనిచేస్తాడని

ఇస్లామాబాద్‌ : భారత్‌ చేతిలో పాకిస్తాన్‌ ఘోర పరాజయం పొందడంపై ఆ జట్టు మాజీ క్రికెటర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 89 పరుగుల (డక్‌వర్త్‌–లూయిస్‌ ప్రకారం) తేడాతో ఘోరపరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో పాక్‌ ఓటమికి కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అనాలోచిత నిర్ణయమే కారణమని అక్తర్‌ మండిపడ్డాడు. తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా.. సర్ఫరాజ్‌, బౌలర్‌ హసన్‌ అలీలపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

‘చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు చేసిన తప్పునే నిన్న పాకిస్తాన్‌ జట్టు చేసింది. సర్ఫరాజ్‌ ఇంత తెలివి తక్కువ పనిచేస్తాడని నేను అసలు ఊహించలేదు. పాక్‌ చేజింగ్‌ చేయలేదనే విషయాన్ని, తమ బలం, ఏ రకమైన బౌలింగ్‌ ముఖ్యమనే విషయాలను మర్చిపోయాడు. పాకిస్తాన్‌ టాస్‌ గెలవగానే సగం మ్యాచ్‌ గెలిచాం అనుకున్నాం. కానీ సర్ఫరాజ్‌ చేజేతులా మ్యాచ్‌ను చేజార్చాడు. టాస్‌ చాలా కీలకం. పాకిస్తాన్‌ 260 పరుగులు చేసినా.. తమకున్న బౌలింగ్‌ వనరులతో కాపాడుకునేది. నిజంగా సర్ఫరాజ్‌ది బ్రెయిన్‌లెస్‌ కెప్టెన్సీ. కెప్టెన్‌గా అతను చేసిన పనిని ఏ మాత్రం సహించలేకపోతున్నాం. ఈ ఓటమి తీవ్ర బాధను మిగిల్చింది. అతనిలో ఇమ్రాన్‌ ఖాన్‌ షేడ్స్‌ చూడాలనుకున్నాను కానీ అతను మాత్రం బుద్ధిలేని పనులకు పాల్పడుతున్నాడు.’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు.

ఇక భారీగా పరుగులు సమర్పించుకున్న బౌలర్‌ హసన్‌ అలీపై సైతం అక్తర్‌ మండిపడ్డాడు. హసన్‌ అలీ కేవలం టీ20, పీఎస్‌ఎల్‌లు మాత్రమే చాలనుకుంటున్నాడని, వన్డేల్లో ఏమాత్రం కష్టపడటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్యాట్స్‌మెన్‌ బాదుతున్నా.. షార్ట్‌ పిచ్‌ బంతులు వేసాడని, అతని బౌలింగ్‌లో ఎలాంటి పేస్‌, స్వింగ్‌ కనిపించలేదన్నాడు. బ్యాట్స్‌మెన్‌ ఏమాత్రం తడబాటుకు గురిచేయలేదని విమర్శించాడు. ఇక 9 ఓవర్లు వేసిన హసన్‌ అలీ ఏకంగా 84 పరుగులు సమర్పించుకున్నాడు.

వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్‌ ఓడినప్పుడు కూడా అక్తర్‌.. సర్ఫరాజ్‌కు బాగా కొవ్వెక్కిందని నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. ‘మా కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ టాస్‌కి వస్తున్న సమయంలో.. కొవ్వు పేరుకుపోయిన అతని పొట్ట వెలుపలికి వచ్చి అసహ్యంగా కనిపించింది. నేను చూసిన మొదటి అన్‌ఫిట్‌  కెప్టెన్ అతనే. అతను తనకున్న కొవ్వుతో కనీసం కదల్లేకపోతున్నాడు. వికెట్ కీపింగ్ సమయంలోనూ ఇబ్బంది పడటం కనిపించింది’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్‌ బౌలర్లలో ఒక్క మహ్మద్‌ ఆమిర్‌ మినహా మిగతా బౌలర్లంతా పోటీపడి పరుగులు సమర్పించుకున్నారు. భారత హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ బ్యాట్‌కు బలయ్యారు. చదవండి: ‘సోనాలీ బింద్రేను కిడ్నాప్‌ చేద్దామనుకున్నా
               మా కెప్టెన్‌కు బాగా కొవ్వెక్కింది : అక్తర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement