లంకను కొట్టేసి...సిరీస్‌ పట్టేసి...

Shikhar Dhawan century guides India to eighth straight series win - Sakshi

మూడో వన్డేలో 8 వికెట్లతో జయభేరి

టీమిండియా 2–1తో సిరీస్‌ కైవసం

కుల్దీప్, చహల్‌ మాయాజాలం

ధావన్‌ అజేయ సెంచరీ

‘ఫిప్టీ’తో రాణించిన శ్రేయస్‌

20 నుంచి టి20 సిరీస్‌

విశాఖ వేదిక భారత్‌కు మళ్లీ విజయ వీచిక అయ్యింది. ముచ్చటగా మూడోసారి ఈ మైదానంలో సిరీస్‌ నిర్ణయాత్మక వన్డేలో టీమిండియా సింహనాదం చేసింది. తొలుత బౌలర్లు... ఆ తర్వాత బ్యాట్స్‌మెన్‌ విజృంభణతో లంకను అలవోకగా కొట్టేసి భారత్‌ మరో సిరీస్‌ను పట్టేసింది. 2007లో ఇక్కడే లంకపై చివరి వన్డేలో నెగ్గి 2–1తో... గతేడాది న్యూజిలాండ్‌ను ఐదో వన్డేలో ఓడించి 3–2తో భారత్‌ సిరీస్‌లు గెలిచింది.

సాక్షి, విశాఖపట్నం: 160/2... 27 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోర్‌ ఇది. 215 ఆలౌట్‌... ఇది కూడా లంక స్కోరే! కానీ 45వ ఓవర్‌ ఇంకా ముగియకముందే ఇన్నింగ్స్‌ ముగిసింది. ప్రత్యర్థి 300 స్కోరు ఖాయం... మ్యాచ్‌ ఇక కష్టమేమో అనుకున్న దశలో మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌ (3/42), యజువేంద్ర చహల్‌ (3/46) మాయాజాలం చేశారు. క్రీజులో పాతుకుపోయిన బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు చేర్చారు. కొత్త బ్యాట్స్‌మెన్‌ను నిలదొక్కుకోకుండా చేశారు. తర్వాత శిఖర్‌ ధావన్‌ (85 బంతుల్లో 100 నాటౌట్‌; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకంతో... శ్రేయస్‌ అయ్యర్‌ (63 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీతో భారత్‌ను విజయతీరాలకు చేర్చారు.

ఫలితంగా ఇక్కడి వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరిగిన మూడో వన్డేలో రోహిత్‌ శర్మ బృందం 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించి మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. భారత్‌కిది వరుసగా ఎనిమిదో ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ విజయం కావడం విశేషం. కుల్దీప్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’... శిఖర్‌ ధావన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ సిరీస్‌’ అవార్డులు లభించాయి. మొదట శ్రీలంక 44.5 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. తరంగ (82 బంతుల్లో 95; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... సమరవిక్రమ (42) రాణించాడు. తర్వాత భారత్‌ 32.1 ఓవర్లలో 2 వికెట్లకు 219 పరుగులు చేసి గెలిచింది. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ కటక్‌లో 20న మొదలవుతుంది.  

టాస్‌ నెగ్గిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... శ్రీలంక ఆరంభంలోనే గుణతిలక (13) వికెట్‌ను కోల్పోయింది. తర్వాత తరంగ, సమరవిక్రమతో కలిసి వేగంగా పరుగులు జతచేశాడు. ఇద్దరు రెండో వికెట్‌కు 121 పరుగులు జోడించారు. ఇక భారీ స్కోరు ఖాయమనుకుంటున్న దశలో 136 స్కోరు వద్ద సమరవిక్రమ, 160 పరుగుల వద్ద తరంగ అవుట్‌ కావడంతో లంక దిశ మారింది. భారత స్పిన్నర్ల ధాటికి అనూహ్యంగా 55 పరుగుల వ్యవధిలో చివరి 8 వికెట్లను కోల్పోయి ఆలౌటైంది. కుల్దీప్, చహల్‌ మూడేసి వికెట్లు తీయగా... పాండ్యాకు రెండు, బుమ్రా, భువనేశ్వర్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది.

తర్వాత 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌... ఆదిలోనే కెప్టెన్‌ రోహిత్‌ (7) వికెట్‌ కోల్పోయి తడబడింది. ఈ దశలో ధావన్, శ్రేయస్‌ అయ్యర్‌ లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. 44 బంతుల్లో శ్రేయస్‌ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్‌కు ధావన్‌తో 135 పరుగులు జోడించాక శ్రేయస్‌ అవుటయ్యాడు. అనంతరం దినేశ్‌ కార్తీక్‌ (26 నాటౌట్‌; 3 ఫోర్లు) ధావన్‌కు సహకరించాడు. 84 బంతుల్లో (13 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ పూర్తి చేసిన ధావన్‌ మూడో వికెట్‌కు కార్తీక్‌తో 70 పరుగులు జోడించి 107 బంతులు మిగిలి ఉండగానే భారత్‌ విజయాన్ని ఖాయం చేశాడు.  

స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్‌: గుణతిలక (సి) రోహిత్‌ శర్మ (బి) బుమ్రా 13; తరంగ (స్టంప్డ్‌) ధోని (బి) కుల్దీప్‌ 95; సమరవిక్రమ (సి) ధావన్‌ (బి) చహల్‌ 42; మాథ్యూస్‌ (బి) చహల్‌ 17; డిక్‌వెలా (సి) శ్రేయస్‌ (బి) కుల్దీప్‌ 8; గుణరత్నే (సి) ధోని (బి) భువనేశ్వర్‌ 17; తిసారా పెరీరా ఎల్బీడబ్ల్యూ (బి) చహల్‌ 6; సచిత్‌ (సి) చహల్‌ (బి) పాండ్యా 7; ధనంజయ (బి) కుల్దీప్‌ 1; లక్మల్‌ ఎల్బీడబ్ల్యూ (బి) పాండ్యా 1; ప్రదీప్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (44.5 ఓవర్లలో ఆలౌట్‌) 215.

వికెట్ల పతనం: 1–15, 2–136, 3–160, 4–168, 5–189, 6–197, 7–208, 8–210, 9–211, 10–215.

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 6.5–0– 35–1, బుమ్రా 8–1–39–1, పాండ్యా 10–1–49–2, కుల్దీప్‌ 10–0– 42–3, చహల్‌ 10–3–46–3.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (బి) ధనంజయ 7; ధావన్‌ నాటౌట్‌ 100; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) లక్మల్‌ (బి) పెరీరా 65; దినేశ్‌ కార్తీక్‌ నాటౌట్‌ 26; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (32.1 ఓవర్లలో 2 వికెట్లకు) 219.

వికెట్ల పతనం: 1–14, 2–149.

బౌలింగ్‌: లక్మల్‌ 5–2–20–0, ధనంజయ 7.1–0–53–1, మాథ్యూస్‌ 3–0–30–0, సచిత్‌ 4–0–33–0, ఫెర్నాండో 3–0–10–0, పెరీరా 5–0–25–1, గుణరత్నే 4–0–30–0, గుణతిలక 1–0–12–0.

నాడు డకౌట్‌... నేడు నాటౌట్‌
ఏడేళ్ల క్రితం (2010లో) ధావన్‌ ఉక్కు నగరంలోనే వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో అతను డకౌట్‌ అయ్యాడు. ఇప్పుడు లంకపై నిర్ణాయక మ్యాచ్‌లో శివమెత్తాడు. కీలకమైన ఓపెనర్, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జట్టు స్కోరు 14 పరుగులకే నిష్క్రమించగా ధావన్‌ ఇన్నింగ్స్‌ భారాన్ని కడదాకా మోశాడు. కుర్రాడు శ్రేయస్‌తో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని జోడించాడు. దినేశ్‌ కార్తీక్‌తో కలిసి అజేయంగా జట్టును గెలిపించాడు.

ధోని కన్ను... మూడో కన్ను...!
తనకెంతో కలిసొచ్చిన వైజాగ్‌ మైదానంలో ఈసారి ధోని రెండు వికెట్లు తీశాడు. ఇదేంటనే ఆశ్చర్యం వద్దు. ఊపు మీదున్న తరంగ సెంచరీకి చేరువైన సమయంలో కుల్దీప్‌ ఇన్నింగ్స్‌ 28వ ఓవర్‌ వేశాడు. తొలి బంతి తరంగను దాటేసి కీపర్‌ ధోని చేతుల్లోకి వెళ్లింది. అతను వాయువేగంతో వికెట్లను గిరాటేసి, అంపైర్‌కు అప్పీల్‌ చేశాడు. ఇదంతా లిప్తపాటు కాలంలోనే జరిగింది. సహచరులంతా అప్పీల్‌ చేసి ఊరుకుంటే ధోని మాత్రం పట్టుబట్టాడు.

దీంతో ఫీల్డ్‌ అంపైర్‌... థర్డ్‌ అంపైర్‌ను సంప్రదించడం... తరంగ అవుటై వెనుదిరగడం జరిగాయి. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన డిక్‌వెలా రెండు ఫోర్లు కొట్టాడు. బంతి దిశను మార్చేయమని కుల్దీప్‌కు చెప్పి తనకు సమీప దూరంలో శ్రేయస్‌ అయ్యర్‌ను పురమాయించాడు. ఈ ఎత్తుగడ ఫలించింది. శ్రేయస్‌కు క్యాచ్‌ ఇచ్చి డిక్‌వెలా నిష్క్రమించాడు. బౌలింగ్‌ కుల్దీప్‌దైనా... వ్యూహం ధోనిది. అతను పాలుపంచుకున్న ఈ వికెట్లు లంక దశను మార్చాయి. భారత్‌కు ఊతమిచ్చాయి.

భారత్‌ 8 సిరీస్‌ విజయాలు
ప్రత్యర్థి              వేదిక             ఏడాది          వన్డేలు         ఫలితం
జింబాబ్వే          జింబాబ్వే         2016           3               3–0
న్యూజిలాండ్‌      భారత్‌             2016           5               3–2
ఇంగ్లండ్‌            భారత్‌            2017            3               2–1
వెస్టిండీస్‌           వెస్టిండీస్‌        2017            5               3–1
శ్రీలంక              శ్రీలంక            2017            5               5–0
ఆస్ట్రేలియా          భారత్‌            2017            5               4–1
న్యూజిలాండ్‌       భారత్‌            2017            3               2–1
శ్రీలంక               భారత్‌            2017            3               2–1

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top