ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 టోర్నమెంట్ ఆడేందుకు భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్ల (Australia Women Cricketers)కు చేదు అనుభవం ఎదురైంది. ఓ కామాంధుడు అసభ్య చేష్టలతో వారిని ఇబ్బంది పెట్టాడు. వెంబడిస్తూ వేధింపులకు గురిచేశాడు.
అసలేం జరిగిందంటే.. మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా మహిళా జట్టు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ (Indore)కు వెళ్లింది. ఈ క్రమంలో గురువారం ఇద్దరు క్రికెటర్లు.. తాము బస చేసే రాడిసన్ బ్లూ హోటల్ సమీపంలోని కేఫ్‌కి వెళ్లారు.
అసభ్యమైన సైగలతో
ఈ క్రమంలో ఖజ్‌రానా రోడ్డులో ఓ వ్యక్తి వారిద్దరిని వెంబడించాడు. అసభ్యమైన సైగలతో వేధింపులకు గురిచేశాడు. వారిలో ఒకరి చేయి పట్టుకుని లాగేందుకు కూడా ప్రయత్నించాడు. ఇంతలో అప్రమత్తమైన సదరు క్రికెటర్లు.. తమ జట్టు సెక్యూరిటీ మేనేజర్ డానీ సిమ్మన్స్‌కు ఎమర్జెన్సీ మెసేజ్ పంపించారు.
ఈ క్రమంలో సిమ్మన్స్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఖజ్‌రానాకు చెందిన 30 ఏళ్ల అకీల్ (Aqeel) అనే వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లు గుర్తించి అతడిని అరెస్టు చేశారు.
ఈ విషయం గురించి డానీ సిమ్మన్స్ మాట్లాడుతూ.. ‘‘ఉదయం 11 గంటల సమయంలో మా ప్లేయర్లు దగ్గర్లో ఉన్న కేఫ్‌కి వెళ్లారు. కొద్దిసేపటికే నాకు ఎమర్జెన్సీ మెసేజ్ పంపించారు. ఓ వ్యక్తి వారిని వెంబడిస్తూ పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగానే
వెంటనే మేము స్పందించి వారిని సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చాము. వారికి ఎలాంటి గాయాలు కాలేదు’’ అని తెలిపారు. స్థానిక పోలీసులు ఈ ఘటన గురించి స్పందిస్తూ.. ‘‘భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 74, 78 ప్రకారం కేసు నమోదు చేశాము. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని త్వరగా గుర్తించగలిగాము’’ అని తెలిపారు.
కాగా సెప్టెంబరు 30న మొదలైన వన్డే వరల్డ్‌కప్... నవంబరు 2న ఫైనల్‌తో ముగియనుంది. భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ సెమీ ఫైనల్ చేరాయి. లీగ్ దశలో భాగంగా ఆస్ట్రేలియా శనివారం ఇండోర్ వేదికగా సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందే మహిళా క్రికెటర్లు ఇలా వేధింపులకు గురికావడం గమనార్హం.


