ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా (IND vs AUS 3rd ODI) బౌలర్లు రాణించారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టును నామమాత్రపు స్కోరుకే ఆలౌట్ చేశారు. యువ పేసర్ హర్షిత్ రాణా (Harshit Rana) నాలుగు వికెట్లతో మెరిసి.. యాజమాన్యం తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా చేదు అనుభవం చవిచూసింది. తొలి రెండు వన్డేల్లో ఓడి సిరీస్‌ను ఆసీస్‌కు కోల్పోయింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సిడ్నీ వేదికగా శనివారం నాటి నామమాత్రపు మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది.
సిరాజ్ మొదలెడితే..
ఆసీస్ టాపార్డర్‌లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (25 బంతుల్లో 29) వేగంగా ఆడే ప్రయత్నంలో మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ప్రసిద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక మరో ఓపెనర్, కెప్టెన్ మిచెల్ మార్ష్ (41)ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ (30) వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
అదరగొట్టిన హర్షిత్
విరాట్ కోహ్లి అద్భుత క్యాచ్ అందుకుని షార్ట్‌ను పెవిలియన్‌కు పంపడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక అలెక్స్ క్యారీ (24), కూపర్ కన్నోలి (23), మిచెల్ ఓవెన్ (1) రూపంలో మూడు కీలక వికెట్లు తీసిన హర్షిత్ రాణా.. జోష్ హాజిల్‌వుడ్ (0)ను కూడా అవుట్ చేశాడు. మొత్తంగా 8.4 ఓవర్లు బౌల్ చేసి 39 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
CLUTCH! ⭐⭐⭐⭐#HarshitRana bags his maiden 4-wicket haul in international cricket as #TeamIndia bowl out Australia in Sydney 👏#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/JXFhwCDgzX
— Star Sports (@StarSportsIndia) October 25, 2025
మిగతా వారిలో సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీయగా.. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మ్యాట్ రెన్షా (56) టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. లోయర్ ఆర్డర్లో నాథన్ ఎల్లిస్ (16) ఫర్వాలేదనిపించాడు. స్టార్క్ (2), జంపా (2*) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.
ఇక సిడ్నీలో గత మూడు మ్యాచ్‌లు ఓడిన టీమిండియా 237 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించి గెలుపు నమోదు చేయాలని పట్టుదలగా ఉంది.
చదవండి: శ్రేయస్ అయ్యర్ సంచలన క్యాచ్.. టీమిండియాకు ఊహించని షాక్!


