
ముంబై: ఈ ఏడాది టాప్–20లోకి చేరడమే తన లక్ష్యమని భారత స్టార్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్ అన్నాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకుల్లో 33వ స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాదిలో తన లక్ష్యాన్ని నెరవేర్చు కోవడంతోపాటు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత్ తప్పకం పతకం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. గతేడాది ఆసియా క్రీడల టీటీలో సాధించిన రెండు కాంస్య పతకాలు తనలో ఆత్మవిశ్వాసం పెంపొందిం చాయని పేర్కొన్న కమల్... ఆ స్ఫూర్తితో ఒలింపిక్స్‌కు అర్హత పొందేందుకు ప్రయత్నిస్తు న్నట్లు వివరించాడు.
ఆసియా క్రీడల్లో తీవ్ర పోటీ ఉంటుందని, అలాంటి చోటే రెండు పతకాలు నెగ్గగలిగామంటే ఇక ఒలింపిక్స్‌లోనూ భారత్‌కు పతకాలు దక్కే రోజు దగ్గరలోనే ఉందని అభిప్రాయపడ్డాడు. ఆసియా క్రీడల్లో శరత్ కమల్ నేతృత్వంలోని భారత జట్టు కాంస్యం నెగ్గి ఈ విభాగంలో దేశానికి 60 ఏళ్ల తర్వాత తొలి పతకాన్ని అందించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. శరత్‌తోపాటు మిక్స్‌డ్ డబుల్స్‌లో మనికా బాత్ర సైతం కాంస్యం నెగ్గి భారత్‌కు ఈ విభాగంలో ఒలింపిక్ పతకాలపై ఆశలు రేకెత్తించారు.