ఐపీఎల్‌ టైటిల్‌ సీఎస్‌కేదే : షేన్‌ వార్న్‌ | Shane Warne Announces His All StarTeam  | Sakshi
Sakshi News home page

May 27 2018 5:43 PM | Updated on May 27 2018 5:51 PM

Shane Warne Announces His All StarTeam  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఐపీఎల్‌-11 సీజన్‌ టైటిల్‌ చెన్నైసూపర్‌ కింగ్స్‌దేనని  ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ షేన్‌వార్న్‌ అభిప్రాయపడ్డాడు. ఆదివారం ముంబై వాంఖెడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌ల మధ్య తుది సమరం జరగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ కోసం తాను ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు వార్న్‌ తెలిపాడు. ఇరు జట్లకు విషెస్‌ తెలియజేస్తూ తన ఆల్‌స్టార్‌ టీమ్‌ను ట్విటర్‌ వేదికగా ప్రకటించాడు. చివర్లో ఈ ఫైనల్లో తన అంచనా ప్రకారం చెన్నై సూపర్‌ కింగ్స్‌ గెలస్తుందని పేర్కొన్నాడు. 

తన ఆల్‌స్టార్‌ జట్టులో జోస్‌ బట్లర్‌, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, రిషబ్‌ పంత్‌, ఎంఎస్‌ ధోని, హార్దిక్‌ పాండ్యా, ఆండ్రూ రస్సెల్‌, రషీద్‌ ఖాన్‌, ఆండ్రూ టై, కుల్దీప్‌, బ్రుమాలకు చోటిచ్చాడు. ఈ జట్టును అంగీకరిస్తారా అని అభిమానులను ప్రశ్నించాడు. అయితే ఈ జట్టులో అద్భుత కెప్టెన్సీతో సన్‌రైజర్స్‌ను ఫైనల్‌కు చేర్చిన కేన్‌ విలియమ్సన్‌ చోటివ్వకపోవడాన్ని అభిమానులు తప్పు బట్టారు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన విలియమ్సన్‌కు చోటు లేకపోవడం ఏమిటని ఓ అభిమాని వార్న్‌ను నిలదీశాడు. ఇంకొందరు కోహ్లి, పంత్‌ల కన్నా విలియమ్సన్‌ ఎంతో బెటర్‌ అని అభిప్రాయపడుతున్నారు.  అలాగే ప్రపంచ గొప్ప బ్యాట్స్‌మన్‌ డివిలియర్స్‌ లేనిది గొప్ప జట్టు ఎలా అవుతుందని ఇంకొందరు మండిపడుతున్నారు. ఇక ఫైనల్‌ విజయంపై సైతం అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొప్ప ప్రదర్శన ఇచ్చిన జట్టు నెగ్గుతుందని చురకలంటించారు.

Advertisement
 
Advertisement
Advertisement