
షారుఖ్ X గంగూలీ
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఫుట్‌బాల్ ఫ్రాంచైజీ కోసం పోటీపడుతున్నారు.
ఫుట్‌బాల్ జట్టు కోసం పోటీ
కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఫుట్‌బాల్ ఫ్రాంచైజీ కోసం పోటీపడుతున్నారు. కొత్తగా రాబోతున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో కోల్‌కతా ఫ్రాంచైజీని దక్కించుకునేందుకు ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్ క్లబ్స్‌తో వీరు మాట్లాడినట్టు సమాచారం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు కెప్టెన్‌గా దాదా విఫలం కావడంతో ఆ స్థానం నుంచి తొలగించడమే కాకుండా వేలంలోనూ షారుఖ్ అతడిని కొనుగోలు చేయలేదు.
ఆ తర్వాత గంగూలీ సహారా ఫుణే వారియర్స్ తరఫున ఆడాడు. ఇదే ఫ్రాంచైజీ కోసం ఐ-లీగ్ క్లబ్ మొహమ్మదన్ స్పోర్టింగ్ కూడా పోటీ పడుతోంది. వచ్చే వారం తమ పాలక మండలిలో ఈ విషయం చర్చిస్తామని క్లబ్ అధ్యక్షుడు సుల్తాన్ అహ్మద్ తెలిపారు. ఏప్రిల్ తొలి వారంలో బిడ్డింగ్ విజేతలను ప్రకటిస్తారు.