
కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక కష్టాల్లో పడింది. మ్యాచ్ రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఆ జట్టు మరో 411 పరుగులు వెనుకబడి ఉంది. తిరిమన్నె (41), కెప్టెన్ చండిమాల్ (15), కుశాల్ మెండిస్ (6) ఔట్ కాగా... కుశాల్ పెరీరా (11 బ్యాటింగ్), ధనంజయ డి సిల్వా (1 బ్యాటింగ్) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు.
నిలకడగా ఆడుతున్న సమయంలో గాయంతో ఓపెనర్ దిముత్ కరుణరత్నే (46) రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. కమిన్స్, స్టార్క్, లయన్‌లకు తలా ఒక వికెట్ దక్కింది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 384/4తో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 534 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కర్టిస్ ప్యాటర్సన్ (192 బంతుల్లో 114 నాటౌట్; 14 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేయగా, టిమ్ పైన్ (45 నాటౌట్) రాణించాడు.
కరుణరత్నే క్షేమం...
మైదానంలో గాయపడిన లంక బ్యాట్స్‌మన్ కరుణరత్నే ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డాడు. లంక ఇన్నింగ్స్ 31వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆసీస్ పేసర్ కమిన్స్ వేసిన బౌన్సర్‌ను తప్పించుకునే ప్రయత్నంలో కరుణరత్నే తలను కుడి వైపుకు తిప్పడంతో బంతి కరుణరత్నే మెడ వెనుక భాగంలో బలంగా తాకింది. ఆ దెబ్బకు అతను మైదానంలో కుప్పకూలిపోయాడు. దాంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఆందోళనకు లోనయ్యారు.
అయితే స్పృహలోనే ఉండి మెల్లగా మాట్లాడుతుండటంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే అతనికి ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు స్ట్రెచర్‌పై బయటకు తీసుకుపోయారు. ఆస్పత్రిలో సాయంత్రం వరకు పరిశీలనలో ఉంచిన అనంతరం కరుణరత్నేకు ప్రమాదం తప్పిందని తేలింది. దాంతో అతడిని డిశ్చార్జ్ చేశారు. మూడో రోజు అతను బ్యాటింగ్‌కు దిగుతాడా లేదని అనేదానిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని లంక బోర్డు ప్రకటించింది.