
టెస్టుల నిర్వహణకు రూ.1 కోటి 33 లక్షలు
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన నాలుగో, ఐదో టెస్టుల నిర్వహణ కోసం నిధులు విడుదల చేసేందుకు బీసీసీఐకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
బీసీసీఐకి సుప్రీం కోర్టు అనుమతి
న్యూఢిల్లీ: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన నాలుగో, ఐదో టెస్టుల నిర్వహణ కోసం నిధులు విడుదల చేసేందుకు బీసీసీఐకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ రెండు మ్యాచ్‌ల కోసం ముంబై, తమిళనాడు సంఘాలకు బోర్డు రూ. 1 కోటి 33 లక్షలు మంజూరు చేసింది. లోధా కమిటీ సిఫారసుల అమలు విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన వల్ల రాష్ట్ర సంఘాలకు నిధులు ఇవ్వరాదని సుప్రీం ఆదేశించింది.
దాంతో మ్యాచ్‌ల నిర్వహణకు డబ్బు కోసం బీసీసీఐ, ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిరీస్‌లో తొలి మూడు టెస్టుల కోసం కూడా ఒక్కో మ్యాచ్‌కు రూ. 58.66 లక్షల చొప్పున బోర్డు తీసుకుంది. అయితే వన్డే సిరీస్ కోసం అడ్వాన్‌సగా రూ. 3.79 కోట్లు ఇవ్వాలని బీసీసీఐ చేసిన విజ్ఞప్తిని సుప్రీం తిరస్కరించింది. అయితే ఒక్కో పరిమిత ఓవర్ల మ్యాచ్‌కు (మొత్తం 3 వన్డేలు, 3 టి20లు ఉన్నాయి) గరిష్టంగా రూ. 25 లక్షల చొప్పున తీసుకునేందుకు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ అనుమతించారు.