నాకౌట్‌ పోరుకు సౌరాష్ట్ర | Sakshi
Sakshi News home page

నాకౌట్‌ పోరుకు సౌరాష్ట్ర

Published Thu, Feb 15 2018 10:21 AM

Saurashtra Enters Quarter finals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్‌లో సౌరాష్ట్ర జట్టు క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. గ్రూప్‌ ‘డి’ చివరి దశ లీగ్‌ మ్యాచ్‌ల్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర 8 వికెట్ల తేడాతో విదర్భపై ఘనవిజయం సాధించింది. దీంతో రంజీ చాంపియన్స్‌ విదర్భ లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌ ముందు వరకు గ్రూప్‌ ‘డి’లో సౌరాష్ట్ర 12 పాయింట్లతో నాలుగో స్థానంలో... విదర్భ, హైదరాబాద్, ఛత్తీస్‌గఢ్‌ 16 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే చివరి లీగ్‌ మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలు సాధించిన హైదరాబాద్‌ (20 పాయింట్లు), సౌరాష్ట్ర (16 పాయింట్లు) జట్లు గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచి నాకౌట్‌ దశకు చేరుకోగా... రన్‌రేట్‌లో సౌరాష్ట్రకంటే వెనుకబడ్డ ఛత్తీస్‌గఢ్, విదర్భ వరుసగా మూడు, నాలుగు స్థానాలతో సంతృప్తి పడ్డాయి.  ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంబటి రాయుడు, సందీప్, సిరాజ్‌ రాణించడంతో హైదరాబాద్‌ 84 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది.

అవీ బరోట్‌ దూకుడు...

సికింద్రాబాద్‌లోని ఏఓసీ సెంటర్‌లో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా రాణించడంతో సౌరాష్ట్ర జట్టు విదర్భను చిత్తుగా ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన విదర్భ 40.5 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. జితేశ్‌ శర్మ (69 బంతుల్లో 55; 5 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. జితేశ్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ రాణించలేకపోయారు. సంజయ్‌ రామస్వామి (29), రవిజాంగిడ్‌ (22) పరవాలేదనిపించారు. సౌరాష్ట్ర బౌలర్లలో జైదేవ్‌ ఉనాద్కట్, శౌర్య సనందియా, ధర్మేంద్రసిన్హ్‌ జడేజా, కమ్లేశ్‌ మక్వానా తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన సౌరాష్ట్ర జట్టు వికెట్‌ కీపర్‌ అవీ బరోట్‌ (114 బంతుల్లో 91 నాటౌట్‌;  13 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో 34 ఓవర్లలో 2 వికెట్లకు 161 పరుగులు చేసి కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. చతేశ్వర్‌ పుజారా (74 బంతుల్లో 46 నాటౌట్‌; 5 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. విదర్భ బౌలర్లలో గుర్బాని, శ్రీకాంత్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.   

జార్ఖండ్‌ ఘనవిజయం  

ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మరో గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లో జార్ఖండ్‌ జట్టు 97 పరుగులతో జమ్మూ కశ్మీర్‌పై నెగ్గింది. మొదట జార్ఖండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 296 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ సింగ్‌ (96; 11 ఫోర్లు) కొద్దిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. ఉత్కర్‌‡్ష సింగ్‌ (31), సుమిత్‌ (35) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో ఉమర్‌ నజీర్, పర్వేజ్‌ రసూల్‌ చెరో 3 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం జమ్మూ కశ్మీర్‌ 46 ఓవర్లలోనే 199 పరుగులకు కుప్పకూలింది. జార్ఖండ్‌ బౌలర్లలో వికాస్‌ సింగ్, ఆశిష్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఈ గెలుపుతో జార్ఖండ్‌ ఐదో స్థానంలో నిలవగా, జమ్మూ ఆరోస్థానాన్ని దక్కించుకుంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడిన సర్వీసెస్‌ జట్టు చివరిదైన ఏడో స్థానంలో ఉంది.   

Advertisement
Advertisement