సానియా జంటకు షాక్ | Sania Mirza loses doubles tie in India's defeat to Japan | Sakshi
Sakshi News home page

సానియా జంటకు షాక్

Feb 5 2016 12:28 AM | Updated on Sep 3 2017 4:57 PM

సానియా జంటకు షాక్

సానియా జంటకు షాక్

ఫెడ్ కప్ గ్రూప్-1 ఆసియా ఓసియానియా జోన్ మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత్‌కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది.

ఫెడ్ కప్‌లో మళ్లీ ఓడిన భారత్
హువా హిన్ (థాయ్‌లాండ్): ఫెడ్ కప్ గ్రూప్-1 ఆసియా ఓసియానియా జోన్ మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత్‌కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. తొలి రోజు బుధవారం థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-3తో ఓడిన టీమిండియా... రెండో రోజు గురువారం జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-2తో ఓటమి పాలైంది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో భారత స్టార్ ప్లేయర్, ప్రపంచ డబుల్స్ నంబర్‌వన్ క్రీడాకారిణి సానియా మీర్జా బరిలోకి దిగినప్పటికీ ఫలితం లేకపోయింది.

తొలి సింగిల్స్‌లో ప్రార్థన తొంబారే 2-6, 1-6తో ఎరి హోజుమి (జపాన్) చేతిలో ఓడిపోగా... రెండో సింగిల్స్‌లో అంకిత రైనా 6-3, 6-1తో నావో హిబినో (జపాన్)పై గెలిచింది. దాంతో స్కోరు 1-1తో సమమైంది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో సానియా మీర్జా-ప్రార్థన తొంబారే ద్వయం 5-7, 3-6తో షుకో అయోమా-ఎరి హోజుమి (జపాన్) జంట చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖాయమైంది. గతేడాది ఆగస్టు తర్వాత మహిళల డబుల్స్ మ్యాచ్‌లో సానియాకు ఓటమి ఎదురవ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement