మరో టైటిల్ కు అడుగు దూరంలో... | Sania Mirza and Martina Hingis Secure Year-End No.1 Ranking | Sakshi
Sakshi News home page

మరో టైటిల్ కు అడుగు దూరంలో...

Oct 31 2015 2:37 PM | Updated on Sep 3 2017 11:47 AM

మరో టైటిల్ కు అడుగు దూరంలో...

మరో టైటిల్ కు అడుగు దూరంలో...

వరుస విజయాలతో దూసుకుపోతున్న సానియా మీర్జా(భారత్)- మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) జోడీ మరో టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది.

సింగపూర్: వరుస విజయాలతో దూసుకుపోతున్న సానియా మీర్జా(భారత్)- మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) జోడీ మరో టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా జంట  6-4, 6-2 తేడాతో హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) పై విజయం సాధించి ఫైనల్స్ కు చేరింది. తొలి సెట్ లో కాస్త పోరాడిన సానియా ద్వయం.. రెండో సెట్ ను అవలీలగా చేజిక్కించుకుని మరో టైటిల్ వేటకు సన్నద్ధమైంది. ఈ తాజా గెలుపుతో సానియా జోడి తమ వరుస విజయాల సంఖ్యను 21 కు పెంచుకుంది.  

ఎనిమిది నెలల క్రితం మార్టినా హింగిస్‌తో జతకట్టిన సానియా అద్వితీయ ఫలితాలు సాధించింది. హింగిస్‌తో కలిసి ఈ ఏడాది ఏకంగా ఎనిమిది డబుల్స్ టైటిల్స్ సాధించింది. అందులో రెండు గ్రాండ్‌స్లామ్ (వింబుల్డన్, యూఎస్ ఓపెన్) టోర్నమెంట్‌లు కూడా ఉండటం విశేషం. మరో ఒక విజయం సాధిస్తే సానియా-హింగిస్ ఖాతాలో ప్రతిష్టాత్మక డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్ కూడా చేరుతుంది.

నంబర్ వన్ ర్యాంకు పదిలం

డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నమెంట్  ఈ సీజన్ ముగింపు టోర్నీ కావడంతో సానియా-హింగిస్ లు మహిళల డబుల్స్ నంబర్ వన్ ర్యాంకింగ్ లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. గత ఏప్రిల్ తొలిసారి ప్రపంచ మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్న సానియా..  వరుస విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఈ సంవత్సరపు ముగింపు ర్యాంకింగ్స్ లో హింగిస్ తో కలిసి సానియా మీర్జా తన మహిళల డబుల్స్ నంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకుంది.
 

ఈ ఏడాది సానియా ఖాతాలో తొమ్మిదో  టైటిల్స్ చేరాయి. అందులో ఎనిమిది టైటిల్స్ (ఇండియన్ వెల్స్, మియామి, చార్ల్స్‌టన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్, గ్వాంగ్‌జూ, వుహాన్, చైనా ఓపెన్) హింగిస్‌తో కలిసి సాధించగా... మిగతా ఒకటి (సిడ్నీ ఓపెన్) బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి సానియా దక్కించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement