రహానే..సెక్యూరిటీ గార్డ్‌ పాత్ర అవసరమా?

Sandeep Patil Questions Rahane's Batting Approach - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానేపై మాజీ చీఫ్‌ సెలక్టర్‌ సందీప్‌ పాటిల్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. విదేశీ గడ్డపై మంచి రికార్డు కల్గి ఉన్న రహానే.. న్యూజిలాండ్‌ పర్యటనలో రక్షణాత్మక ధోరణిలో ఆడటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అసలు క్రీజ్‌లోకి రహానే ఎందుకు వెళుతున్నాడో తెలియకుండా అతని బ్యాటింగ్‌ సాగిందంటూ మండిపడ్డారు. క్రీజ్‌లోకి వెళ్లేది పరుగులు చేయడానికా.. లేక స్థానాన్ని కాపాడుకోవడానికా అంటూ సందీప్‌ పాటిల్‌ ప్రశ్నించారు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో రహానే పరుగులు చేయడాన్ని పక్కన పెట్టి, క్రీజ్‌లో పాతుకుపోవడానికే ప్రాధాన్యత ఇచ్చాడని విమర్శించారు. ఒకవేళ నువ్వు క్రీజ్‌లో పాతుకుపోతే పరుగులు ఎవరు చేస్తారన్నారు. తన స్థానాన్ని కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టిన రహానే..తన  ఆటను పూర్తిగా మరిచిపోయినట్లే ఆడాడని సందీప్‌ పాటిల్‌ ఎద్దేవా చేశారు. సెక్యూరిటీ గార్డ్‌ పాత్ర పోషించడానికి క్రీజ్‌లోకి వెళతారా అంటూ రహానే బ్యాటింగ్‌ శైలిపై విమర్శలు చేశారు. (హార్దిక్‌ చితక్కొట్టుడు మామూలుగా లేదు!)

‘ ఈ సీజన్‌లో ముంబై తరఫున రహానే ఆడేటప్పుడు చాలా స్లోగా బ్యాటింగ్‌ చేశాడనే వ్యాఖ్యలను విన్నాను. ఇది ఎందుకు జరుగుతుంది.. విఫలం అవుతాననే భయంతోనే కదా. నీకు విదేశీ గడ్డపై మంచి రికార్డు ఉందనే విషయం క్రికెట్‌ చరిత్రే చెబుతుంది. దాంతోనే నీకు మంచి టెస్టు ప్లేయర్‌గా ముద్ర వేశారు కూడా.  నువ్వు కేవలం టెస్టు ప్లేయర్‌ అనే ముద్రతోనే పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులో కూడా చోటు కోల్పోయావు. నువ్వు టెక్నికల్‌ ప్లేయర్‌వే. మరి అటువంటప్పుడు క్రీజ్‌లో పాతుకుపోవడానికే యత్నిస్తే ఎలా. క్రీజ్‌లో ఉండటానికే యత్నిస్తే పరుగులు ఎవరు చేస్తారు.. ఇలా చేస్తే ‘సెక్యూరిటీ గార్డ్‌’ అనే అంటారు’ అని సందీప్‌ పాటిల్‌ హితబోధ చేశాడు. 

ఇక హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి, బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌లపై కూడా సందీప్‌ పదునైన విమర్శలు చేశారు. రహానే పరిస్థితిని అర్థం చేసుకోవడంలో విఫలమైతే, రవిశాస్త్రి, విక్రమ్‌ రాథోడ్‌లు ఏం చేస్తున్నారన్నారని నిలదీశారు. ఒక బ్యాట్స్‌మన్‌ విఫలమైతే, మిగతా వారు అదే దారిలో పయనించడంతోనే ఘోరంగా టెస్టు సిరీస్‌ను కోల్పోయామన్నారు. ఇక్కడ కోచింగ్‌ స్టాఫ్‌ ఏం చేశారో తనకైతే అర్థం కాలేదని చురకలంటించారు. సమష్టి బ్యాటింగ్‌ వైఫల్యం చెందిన తర్వాత బౌలింగ్‌ ఎంతో మెరుగ్గా ఉండాలని కోరుకోవడం కూడా అత్యాశే అవుతుందన్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top