ఆరో భారత ఆటగాడిగా..

Sachin Sixth Indian To Be Inducted ICC Hall of Fame - Sakshi

హైదరాబాద్‌: క్రికెట్‌ లెజెండ్‌, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం లభించింది. 'లెజెండ్‌ అనే పదం సచిన్‌కి తక్కువే.. తాజాగా ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ఆయనకి స్థానం కల్పించాం' అని ఐసీసీ తన అధికారిక ట్విటర్‌లో ట్వీట్‌ చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అటు టెస్టులు, ఇటు వన్డేల్లో అత్యధిక పరుగులతోపాటు వంద శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్‌ సచిన్‌ అంటూ ఐసీసీ ప్రశంసల జల్లు కురిపించింది. సచిన్‌కు ఈ ఘనత దక్కడం పట్ల తాజా, మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్‌ ఆనందం​ వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సచిన్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ అలెన్‌ డొనాల్డ్‌, ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్‌ ఫిట్జ్‌పాట్రిక్‌లకు సైతం ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కింది. ఇక ఈ ఘనత దక్కడం పట్ల సచిన్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ‘నాకు లభించిన ఈ గుర్తింపు పట్ల చాలా సంతోషంగా ఉంది, ఇది నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నా’అంటూ సచిన్‌ పేర్కొన్నాడు. కాగా ఈ ఘనత అందుకున్న ఆరో భారతీయుడిగా సచిన్ నిలిచాడు. గతంలో బిషన్‌సింగ్ బేడి(2009), సునీల్‌ గవాస్కర్‌(2009), కపిల్‌దేవ్‌(2009), అనిల్ కుంబ్లే (2015), రాహుల్‌ ద్రవిడ్‌ (2018) లకు ఈ ఘనత దక్కింది.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top