
రోహిత్ శర్మతో విరాట్ కోహ్లి (PC: BCCI)
భారత స్వాతంత్య్ర దినోవత్సం సందర్భంగా క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) ఉద్వేగపూరిత నోట్ రాశాడు. ఎంతో మంది వీరుల ప్రాణత్యాగాల వల్లే మనం ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని పేర్కొన్నాడు. అలాంటి నిజమైన హీరోలకు సెల్యూట్ చేస్తున్నానంటూ... దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు.
భారతీయుడినైనందుకు గర్విస్తున్నా
‘‘ఈరోజు మనం ఇలా స్వేచ్ఛగా నవ్వగలుగుతున్నామంటే అందుకోసం నాడు వారంతా ధైర్యంగా ఒక్కటై పోరాడటమే కారణం. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మన వీరుల త్యాగాన్ని గౌరవిస్తూ.. వారికి సెల్యూట్ చేస్తున్నా. భారతీయుడినైనందుకు గర్విస్తున్నా. జై హింద్’’ అంటూ విరాట్ కోహ్లి ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. అతడి పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో 82 శతకాలు సాధించిన కోహ్లి.. ఇప్పటికే ఇంటర్నేషనల్ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం వన్డే, ఐపీఎల్‌లో కొనసాగుతున్న ఈ దిగ్గజ బ్యాటర్.. ఇటీవలే మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు అతడు సన్నద్ధమవుతున్నాడు.
కాగా టీమిండియా తరఫున 123 టెస్టులు ఆడిన కోహ్లి.. 30 శతకాలు, ఏడు డబుల్ సెంచరీల సాయంతో 9230 పరుగులు సాధించాడు. అదే విధంగా.. 125 టీ20 మ్యాచ్‌లలో కలిపి 4188 రన్స్ చేశాడు. ఇందులో ఓ శతకంతో పాటు 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
లండన్‌లో నివాసం
మరోవైపు.. వన్డేల్లో ఛేజింగ్ కింగ్‌గా పేరొందిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్‌కు కూడా సాధ్యం కాని విధంగా.. 51 సెంచరీలతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
ఇక కోహ్లి వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. తన భార్య అనుష్క శర్మ, పిల్లలు వామికా, అకాయ్‌లతో కలిసి లండన్‌లోనే ఎక్కువగా నివాసం ఉంటున్నాడు. కెరీర్‌కు సంబంధించిన షెడ్యూల్ పూర్తికాగానే వెంటనే లండన్‌లో వాలిపోతున్నాడు. తమ పిల్లల గోప్యత, సంరక్షణ దృష్ట్యా కోహ్లి దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
దిగ్గజాల శుభాకాంక్షలు.. నా దేశమే నా గుర్తింపు
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ.. టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను విజేతగా నిలిపిన తర్వాత మువ్వన్నెల జెండా చేతబట్టిన ఫొటోను షేర్ చేశాడు.
ఇక టీమిండియా దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే, మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ తదితరులు 79వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉంటే.. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్.. ‘‘నా దేశం, నా గుర్తింపు.. నా జీవితం.. జై హింద్’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.
చదవండి: ధోని జట్టు నుంచి నన్ను తప్పించాడు.. అప్పుడే రిటైర్ అయ్యేవాడిని.. కానీ..: సెహ్వాగ్