రఫ్పాడించిన రసెల్‌ | Russell Stunning Assault Gives KKR Thrilling Win Against Sunrisers | Sakshi
Sakshi News home page

రఫ్పాడించిన రసెల్‌

Mar 24 2019 8:09 PM | Updated on Mar 24 2019 8:12 PM

Russell Stunning Assault Gives KKR Thrilling Win Against Sunrisers - Sakshi

కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-12వ సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అద్భుతమైన విజయాన్ని సాధించింది. సన్‌రైజర్స్‌ విసిరిన 182 పరుగుల లక్ష్యాన్ని ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి తమ సొంత గ్రౌండ్‌లో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. మరొకవైపు ఐపీఎల్‌లో తాము ఆడుతున్న తొలి మ్యాచ్‌లో విజయాల్ని సాధించే రికార్డును మరింత మెరుగుపరుచుకుంది. 2013 నుంచి కేకేఆర్‌ తన తొలి మ్యాచ్‌లో ఇప్పటివరకూ ఓటమి చూడలేదు.  తాజా మ్యాచ్‌లో ఆండ్రీ రసెల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడి సన్‌రైజర్స్‌ ఆశలకు గండికొట్టాడు. 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 49 పరుగులు సాధించి కేకేఆర్‌ విజయంలో ముఖ్య భూమిక పోషించాడు.

సన్‌రైజర్స్‌ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో కేకేఆర్‌ ఆదిలోనే క్రిస్‌ లిన్‌(7) వికెట్‌ను కోల్పోయింది.  ఆ తరుణంలో నితీష్‌ రాణా-రాబిన్‌ ఊతప్పల జోడి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 80 పరుగులు సాధించి కేకేఆర్‌ను గాడిలో పెట్టారు. ఈ క్రమంలోనే రాణా(68; 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత దినేశ్‌ కార్తీక్‌(2) విఫలమైనప్పటికీ రసెల్‌ రెచ్చిపోయి ఆడాడు. బౌండరీలే లక్ష్యంగా చెలరేగి ఆడటంతో మ్యాచ్‌ ఒ‍క్కసారిగా కేకేఆర్‌ చేతుల్లోకి వచ్చేసింది. అతనికి జతగా శుభ్‌మన్‌ గిల్‌(18 నాటౌట్‌; 10 బంతుల్లో 2 ఫోర్లు) సమయోచితంగా ఆడటంతో కేకేఆర్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

అంతకుముందు సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌ స్టోలు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత బెయిర్‌ స్టో(39; 35 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) పెవిలియన్‌ చేరాడు. అనంతరం వార‍్నర్‌కు జత కలిసిన విజయ్‌ శంకర్‌ స్కోరు బోర్డును చక్కదిద్దాడు. డేవిడ్‌ వార్నర్‌ రీ ఎంట్రీలో అదరగొట్టి సన్‌రైజర్స్‌ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించాడు. 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేసి తానెంత విలువైన ఆటగాడినో మరోసారి చాటిచెప్పాడు. ఆపై విజయ్‌ శంకర్‌(40 నాటౌట్‌; 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో సన్‌రైజర్స్‌ పోరాడే స్కోరును ఉంచకల్గింది. అయితే కేకేఆర్‌ ఆటగాళ్ల విజృంభణతో సన్‌రైజర్స్‌ నిర్దేశించిన లక్ష్యం చిన్నబోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement