గంగూలీ చెప్పినట్లే చేశా: పంత్‌

Rishabh Reveals Advice From Sourav Ganguly - Sakshi

రీఎంట్రీపై రిషభ్‌ ఆశలు

పాంటింగ్‌ స్వేచ్ఛనిచ్చాడు..

న్యూఢిల్లీ: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ తన అంతర్జాతీయ కెరీర్‌ ఆరంభించిన రెండేళ్ల కాలంలోనే ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూశాడు. కెరీర్‌ మొదట్లో ఒక కీలక ఆటగాడిగా ఉన్న పంత్‌.. ఆ తర్వాత క‍్రమేపీ తన ఫామ్‌ను కోల్పోయి జట్టులో స్థానంపై నమ్మకాన్ని కోల్పోయాడు. రిషభ్‌ పంత్‌ టాలెంటెడ్‌ ఆటగాడని చెబుతూ వచ్చిన మేనేజ్‌మెంట్‌ పెద్దలే పంత్‌ను పక్కన పెట్టేశారు. గత ఏడాది చివర్లో ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో పంత్‌కు అయిన గాయం అతని కెరీర్‌నే ప్రమాదంలో పడేసింది. అప్పుడు పంత్‌ స్థానంలో కీపింగ్‌ బాధ్యతలు నిర్వర్తించిన కేఎల్‌ రాహుల్‌.. అటు బ్యాట్స్‌మన్‌గా, ఇటు కీపర్‌గా రాణించడంతో పంత్‌ అవసరం లేకుండా పోయింది. (ఆసీస్‌ క్రికెటర్లు.. ఇవి పాటించాల్సిందే!)

జట్టులో ఎంపికవుతున్నప్పటికీ రిజర్వ్‌ బెంచ్‌కే పంత్‌ పరిమితం అవుతూ వస్తున్నాడు. ప్రస్తుతానికి కరోనా వైరస్‌ ​కారణంగా క్రికెట్‌ టోర్నీలో ఏమీ లేకపోయినా పంత్‌ కెరీర్‌ మాత్రం డైలమాలో పడింది. ఒకవైపు ఎంఎస్‌ ధోని కెరీర్‌ దాదాపు ముగింపు దశకు వచ్చిన తరుణంలో పంత్‌కు స్థానంపై గ్యారంటీ లేకుండా పోయింది. రాహుల్‌ మెరవడం పంత్‌ కెరీర్‌ను ఇబ్బందిలోకి నెట్టిందనే సగటు క్రికెట్‌ అభిమానికి తెలిసిన విషయం. జట్టులో అదనపు బ్యాట్స్‌మన్‌ కాన్సెప్ట్‌తో ముందుకు వెళుతున్న టీమిండియా.. స్పెషలిస్టు కీపర్‌గా పంత్‌ను పరిగణలోకి తీసుకోవడం లేదనేది కాదనలేని వాస్తవం. మరి పంత్‌ కెరీర్‌ ఎలా ముందుకు సాగుతుందనేది కాలమే జవాబు చెప్పాల్సి ఉన్నా భారత జట్టులో రీఎంట్రీపై మాత్రం అతను ఆశగా ఉన్నాడు. 

గంగూలీ చెప్పినట్లే చేశా..
తన కెరీర్‌ ఆరంభంలో భారత జట్టు మాజీ సారథి, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ చెప్పిన కొన్ని సూచనలు తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని పంత్‌ స్పష్టం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో గంగూలీతో ఉన్న కొన్ని అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు మెంటార్‌గా గంగూలీ ఉన్న సమయంలో అతను చేసిన సూచనలు తనకు లాభించాయన్నాడు. ‘ నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో అది చేసి చూడు. కానీ ఏదైనా చేసే ముందు నీకు నువ్వే కొంత సమయం తీసుకో అని గంగూలీ భాయ్‌ చెప్పాడు.  నా ప్రదర్శనపై విశ్వాసం ఉంచి ఎప్పుడూ అండగా ఉండేవాడు. ఈ క్రమంలోనే బ్యాటింగ్‌లో ఎన్నో టెక్నిక్స్‌ సూచించాడు. వాటిని అమలు చేసి సక్సెస్‌ కూడా అయ్యా’ అని పంత్‌ చెప్పుకొచ్చాడు. ఇక డీసీ కోచ్‌ గా ఉన్న రికీ పాంటింగ్‌ కూడా తనకు అండగా ఉండేవాడన్నాడు. తనకు తగినంత స్వేచ్ఛ ఇచ్చి ప్రోత్సహించే వాడని పంత్‌ చెప్పుకొచ్చాడు.  (రెండింటిలోనూ కోహ్లినే గ్రేట్‌: చాపెల్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top