భారత క్రికెట్‌ జట్టులో గ్రూపు తగాదాలు?

Rift Between Kohli and Rohit Factions, Bias in Team Selection - Sakshi

మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగి సెమీస్‌లోనే తమ ప్రస్థానాన్ని ముగించి స్వదేశానికి తిరిగి పయనమయ్యేందుకు సిద్ధమైంది. భారత్‌ సెమీస్‌లోనే తన ఆటను ముగించి నాలుగు రోజులు కావొస్తున్నా, ఆ ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఇంకా భారత క్రికెట్‌ అభిమానులు ఆ షాక్‌లోనే ఉండగా.. తాజాగా జట్టులో గ్రూపు తగాదాలున్నాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చెరో క్యాంప్‌ నడుపుతున్నారనే పుకార్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఒక వర్గం కోహ్లి వైపైతే మరో వర్గం రోహిత్‌వైపు ఉన్నట్టు తెలుస్తోంది.

అదే సమయంలో కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రి మధ్య కూడా సఖ్యత లేదనే విషయం బయటకు వస్తోంది. గతంలో అనిల్‌ కుంబ్లేతో పడకపోవడంతో అతన్ని సాగనంపడానికి కోహ్లి ప్రధాన కారణమయ్యాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. కోహ్లి, రవిశాస్త్రిలు ఒకరికి తెలియకుండా ఒకరు నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. అదే జట్టులో అంతర్గత విభేదాలకు కారణమైందని కూడా విశ్లేషిస్తున్నారు. తాజాగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ అవుటయ్యాక రవిశాస్త్రి దగ్గరికి వచ్చి కోహ్లి వాగ్వాదం చేసిన విషయం తెలిసిందే.  వరల్డ్‌కప్‌కు అంబటి రాయుడును కాదని విజయ్‌ శంకర్‌ ఎంపిక చేయడమే దానికి ఉదాహరణగా చెబుతున్నారు. కోహ్లికి బోర్డు పాలకుల కమిటీ (సీవోఏ) చీఫ్‌ వినోద్‌ రాయ్‌ అండదండలు ఉండడంతో అతడి నిర్ణయాలను ఎవరూ వ్యతిరేకించే సాహసం చేయలేక పోతున్నారట..!

 
ప్రస్తుత భారత క్రికెట్‌ జట్టులో రెగ్యులర్‌ ఆటగాళ్లుగా కొనసాగుతున్న కేఎల్‌ రాహుల్‌, చహల్‌ విషయాల్లో కోహ్లి జోక్యం శృతి మించిందని ప్రచారం. వీరిద్దరూ పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నప్పటికీ కోహ్లి అండదండలతోనే నెట్టకొస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో అంబటి రాయుడు విషయంలో కూడా వరల్డ్‌కప్‌కు ముందు పెద్ద చర్చే నడిచినట్లు తెలుస్తోంది. అతన్ని పేరుకు మాత్రమే స్టాండ్‌ బైగా ఎంపిక చేసినప్పటికీ జట్టులోకి రానివ్వకూడదని టీమిండియా మేనేజ్‌మెంట్‌ బలంగా కోరుకుందట. దాంతోనే అంబటిని అసలు పట్టించుకుపోవడానికి కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం భారత క్రికెట్‌ జట్టు ఇంకా ఇంగ్లండ్‌లోనే ఉంది. ఫైనల్‌ అయిన తర్వాత స్వదేశానికి వచ్చే అవకాశం ఉంది. భారత క్రికెట్‌ జట్టులో వేరు కుంపట్లు అంటూ వస్తున్న వార్తల్లో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తేకానీ అసలు విషయం బయటకు రాదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top