బాల్‌ ట్యాంపరింగ్‌పై నోరువిప్పిన పాంటింగ్‌ | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 6 2018 11:50 AM

Ricky Ponting Says He Is Shocked By The Ball Tampering Scandal - Sakshi

న్యూఢిల్లీ : బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ తొలి సారి నోరు విప్పాడు. ఐపీఎల్‌ సందర్భంగా ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఈ ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ గురువారం మీడియాతో మాట్లాడారు. బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం తెలుసుకొని షాక్‌ గురయ్యానని, గత రెండు వారాల క్రితం దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ ఘటనపై తొలి సారి స్పందిస్తున్నట్లు పేర్కొన్నాడు.

‘ఆ రోజు మైదానంలో జరిగినది చూసి ఓ మాజీ ఆటగాడిగా, మాజీ కెప్టెన్‌గా షాక్‌కు గురయ్యా. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ వారు ఇప్పటికే కన్నీటితో పశ్చాతాపం వ్యక్తం చేశారు. ఆసీస్‌ అభిమానులు ఎప్పుడు నిజాయితీతో కూడుకున్న ఆటను కోరుకుంటారు. మేం కూడా ఇప్పటి వరకు అలానే ఆడాం. ఈ ఘటనపై ఇంత దుమారం రేగాడికి కారణం ఆసీస్‌ ఆటగాళ్ల ఆటలో నిజాయితీ తప్పడమేనని భావిస్తున్నా. ఆస్ట్రేలియా క్రికెట్‌ సంప్రదాయం గురించి చర్చ జరగడం ఆసక్తి కరంగా ఉంది. కొన్ని నెలల క్రితం ఆసీస్‌ యాషెస్‌ నెగ్గినపుడు ఎవరు సంప్రదాయం గురించి మాట్లాడలేదు. కాబట్టి సంప్రదాయం, డ్రెస్సింగ్‌ రూం వ్యవహారాలు వేరని ’ఈ మాజీ కెప్టెన్‌ చెప్పుకొచ్చాడు. ఇక పాంటింగ్‌ సారథ్యంలో ఆసీస్‌ రెండు సార్లు ప్రపంచకప్‌ గెలిచింది. దక్షిణాఫ్రికా పర్యటనలో వెలుగుచూసిన బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంతో ఆసీస్‌ ఆటగాళ్లు బాన్‌క్రాఫ్ట్‌, స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లపై ఆదేశ క్రికెట్‌ బోర్డు నిషేదం విధించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement