
వకార్ యూనిస్
లాహోర్: రివర్స్ స్వింగ్ చేయడానికి ప్రధానంగా బంతి ఆకారాన్ని మార్చడంపైనే పేస్ బౌలర్లు ఆధారపడుతున్నారనే ఆరోపణలపై పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్ స్పందించాడు. అసలు రివర్స్ స్వింగ్ చేయడానికి చీటింగ్ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ‘ఈ రోజుల్లో ప్రతీ ఒక్క పేసర్ రివర్వ్ స్వింగ్ చేయడానికి యత్నిస్తున్నారు. వికెట్లు తీయడానికి రివర్స్ స్వింగ్ అనేది మంచి అస్త్రం. అయితే బంతిని రివర్స్ స్వింగ్ చేయాలంటే బంతి ఆకారాన్ని దెబ్బతీసి మోసం చేయాల్సిన అవసరమైతే లేదు' అని వకార్ తెలిపాడు.
దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో బంతిని ట్యాంపరింగ్ చేసిన వివాదంలో చిక్కుకున్న డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, బాన్ క్రాఫ్ట్‌లు నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంతి ఆకారం మార‍్చడానికి రివర్స్ స్వింగ్ చేయాలనే తపనే కారణమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై వకార్ పైవిధంగా స్పందించాడు.మరొకవైపు వేర్వేరు దేశాల్లో భిన్నమైన బంతుల్ని వాడటాన్ని కూడా వకార్ ప్రశ్నించాడు. అసలు ఎందుకు ఇలా బంతుల్ని వాడాల్సి వస్తుందంటూ నిలదీశాడు. బంతిని రివర్స్ స్వింగ్ చేయడానికి డ్యూక్ బాల్‌తో పాటు ఎస్‌జీ బాల్ అనువైనదిగా వకార్ తెలిపాడు.