ఈసారి ఐపీఎల్ ట్రోఫీ మాదే: ఖరీదైన క్రికెటర్ | Sakshi
Sakshi News home page

ఈసారి ఐపీఎల్ ట్రోఫీ మాదే: ఖరీదైన క్రికెటర్

Published Mon, Jan 29 2018 7:06 PM

Rajasthan Royals will grab the title ipl, says Jaydev Unadkat - Sakshi

సాక్షి, రాజ్‌కోట్‌: ఐపీఎల్‌-11 సీజన్‌ నేపథ్యంలో ఇటీవల జరిగిన వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో రెండోవాడు జయదేవ్‌ ఉనాద్కట్‌. పంజాబ్‌కే ఖాయం అనిపించిన దశలో అనూహ్యంగా రాజస్తాన్‌ రాయల్స్‌ ఏకంగా 11.5 కోట్లతో ఉనాద‍్కట్‌ను సొంతం చేసుకోవడంతో భారత్‌ నుంచి వేలంలో అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా నిలిచాడు. భారీ ప్యాకేజీతో తనను కొనుగోలు చేయడంపై టీమిండియా క్రికెటర్ ఉనాద్కట్ హర్షం వ్యక్తం చేశాడు. రెండేళ్ల నిషేధం తర్వాత బరిలోకి దిగుతున్న తమ జట్టు రాజస్తాన్ ఐపీఎల్-11 సీజన్ ట్రోఫీ నెగ్గుతుందని ధీమా వ్యక్తం చేశాడు. అత్యుత్తమ ప్రదర్శనతో జట్టుకు సాధ్యమైనన్ని విజయాలు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.

తొలిరోజు వేలంలో రూ.11 కోట్ల ధర పలికిన మనీశ్ పాండే, కేఎల్‌ రాహుల్‌లను రెండోరోజు జరిగిన ఐపీఎల్ వేలంలో అధిగమించాడు ఈ సౌరాష్ట్ర ప్లేయర్. రూ.11.5 కోట్ల ధరతో ఈ సీజన్ వేలంలో బెన్ స్టోక్స్ (రూ.12.5 కోట్లు) తర్వాత అత్యంత ఖరీదైన క్రికెటర్‌గా రికార్డులు తిరగరాశాడు ఉనాద్కట్. గత ఏడాది పుణే తరఫున ఆడిన ఉనాద్కట్‌ హ్యాట్రిక్‌ సహా 7.02 ఎకానమీతో 24 వికెట్లు పడగొట్టి భువనేశ్వర్‌ (26) తర్వాత రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుత వేలం ధరతో ఈ ఆటగాడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
 

Advertisement
Advertisement