
జైపూర్ : టీ20 క్రికెట్లో రాజస్థాన్‌కు చెందిన యువ బౌలర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో గతంలో ఎవ్వరికీ సాధ్యంకాని రీతిలో ఆకాశ్ చౌధరీ అనే టీనేజ్ బౌలర్ ఏకంగా పదికి పది వికెట్లు తీశాడు. ప్రత్యర్థి జట్టుకు ఒక్క పరుగు కూడా సమర్పించుకోకుండా ఈ అరుదైన ఫీట్ నెలకొల్పడం గమనార్హం. అంతర్జాతీయ, దేశవాళీ ఏ స్థాయి టీ20 క్రికెట్‌లోనైనా 15 ఏళ్ల బౌలర్ అకాశ్ గణాంకాలు 4-4-0-10 నమోదు చేయడం దాదాపు అసాధ్యం.
స్థానిక క్రికెట్ స్డేడియం ఓనర్లు వారి తాత భవెర్ సింగ్ జ్ఞాపకార్థం టీ20 టోర్నీ నిర్వహించాలనుకున్నారు. ఇందులో భాగంగా బుధవారం దిశా క్రికెట్ అకాడమీ, పెరల్ అకాడమీ జట్లు తలపడ్డాయి. తొలుత టాస్ నెగ్గిన పెరల్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుకోగా, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన దిశా జట్టు 20 ఓవర్లలో 156 పరుగులు చేసింది. 157 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పెరల్ జట్టు దిశా అకాడమీ పేస్ బౌలర్ ఆకాశ్ చౌధరీ చెలరేగడంతో 36 పరుగులకే ఆలౌటైంది.
మొత్తం నాలుగు ఓవర్లు వేసిన ఆకాశ్.. తన తొలి 3 ఓవర్లలో ఓవర్‌కు రెండు వికెట్లు చొప్పున ఆరు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి పెరల్ జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు ఆకాశ్. తాను బౌలింగ్ చేసిన నాలుగో ఓవర్ లో హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు తీయడంతో పెరల్ జట్టు 36 పరుగులకే ఆలౌటైంది. దీంతో 120 పరుగుల తేడాతో దిశా అకాడమీ ఘన విజయం సాధించింది.