నాదల్‌ దూకుడు | Rafael Nadal Enters Pre Quarters In Australian Open | Sakshi
Sakshi News home page

నాదల్‌ దూకుడు

Jan 26 2020 2:17 AM | Updated on Jan 26 2020 2:17 AM

Rafael Nadal Enters Pre Quarters In Australian Open - Sakshi

రాఫెల్‌ నాదల్‌

మెల్‌బోర్న్‌: ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో మహిళల ఈవెంట్లో మళ్లీ సంచలనాల మోత మోగింది. చెక్‌ రిపబ్లిక్‌ స్టార్, రెండో సీడ్‌ ప్లిస్కోవా ఆట మూడో రౌండ్లోనే ముగిసింది. ఐదో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌), ఆరో సీడ్‌ బెన్సిక్‌ (స్విట్జర్లాండ్‌)లపై ప్రత్యర్థులు సంచలన విజయాలు నమోదు చేశారు. పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్‌ దిగ్గజం నాదల్‌ అలవోక విజయంతో ప్రిక్వార్టర్స్‌ చేరాడు. నాలుగో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా), ఐదో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా), ఏడో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), 15వ సీడ్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌), 23వ సీడ్‌ కిర్గియోస్‌ (ఆ్రస్టేలియా)లు కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు.

ఎదురేలేని నాదల్‌
టైటిల్‌ ఫేవరెట్, స్పానిష్‌ టాప్‌సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ ఏకపక్ష విజయంతో ముందంజ వేశాడు. ఇప్పటికే 19 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన ఈ దిగ్గజ ఆటగాడు 20వ టైటిలే లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో అతను వరుస సెట్లలో 6–1, 6–2, 6–4తో తన దేశానికే చెందిన 27వ సీడ్‌ కారెనో బుస్టాను ఓడించాడు.కేవలం గంటా 38 నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ను ముగించాడు. మిగతా పోటీల్లో మెద్వెదెవ్‌ 6–4, 6–3, 6–2తో అలెక్సి పొపిరిన్‌ (ఆ్రస్టేలియా)పై, డొమినిక్‌ థీమ్‌ 6–2, 6–4, 6–7 (5/7), 6–4తో అమెరికాకు చెందిన ఫ్రిట్జ్‌పై, జ్వెరెవ్‌ 6–2, 6–2, 6–4తో వెర్డాస్కో (స్పెయిన్‌)పై, పదో సీడ్‌ మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌) 7–6 (7/2), 6–4, 6–3తో క్వాలిఫయర్‌ ఎర్నెస్ట్స్‌ గుల్బిస్‌ (లాతి్వయా)పై గెలుపొందారు. 23వ సీడ్‌ కిర్గియోస్‌ 6–2, 7–6 (7/5), 6–7 (6/8), 6–7 (7/9), 7–6 (10/8)తో 16వ సీడ్‌ కచనోవ్‌ (రష్యా)పై చెమటోడ్చి నెగ్గాడు. వావ్రింకా 6–4, 4–1తో ఇస్నర్‌ (అమెరికా)పై ముందంజలో ఉండగా... ప్రత్యర్థి రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.

ప్లిస్కోవాపై రష్యన్‌ సంచలనం
గతేడాది ఈ గ్రాండ్‌స్లామ్‌ ఈవెంట్‌లో సెమీస్‌ చేరిన ప్రపంచ రెండో ర్యాంకర్‌ ప్లిస్కోవా ఈసారి మూడోరౌండ్‌తోనే సరిపెట్టుకుంది. రష్యాకు చెందిన అనస్తాసియా పాల్యుచెంకొవా 7–6 (7/4), 7–6 (7/3)తో రెండో సీడ్‌ ప్లిస్కోవాపై సంచలన విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో రెండు సెట్లు కూడా టైబ్రేక్‌కు దారితీశాయి. మిగతా మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో  స్విస్‌ స్టార్, ఆరో సీడ్‌ బెన్సిక్‌ 0–6, 1–6తో 28వ సీడ్‌ అనెట్‌ కొంటవెట్‌ (ఈస్టోనియా) చేతిలో చిత్తుగా ఓడింది.

మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ ముగురుజా (స్పెయిన్‌) 6–1, 6–2తో ఐదో సీడ్‌ స్వితోలినాను ఇంటిదారి పట్టించగా... నాలుగో సీడ్‌ హలెప్‌ (రొమేనియా) 6–1, 6–4తో పుతినెత్సెవా (కజకిస్తాన్‌)పై సునాయాస విజయం సాధించింది. 2016  చాంపియన్, 17వ సీడ్‌ ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ) 6–2, 6–7 (4/7), 6–3తో కెమిలా జియోర్జి (ఇటలీ)పై, 16వ సీడ్‌ మెర్టెన్స్‌ (బెల్జియం) 6–1, 6–7 (5/7), 6–0తో బెలిస్‌ (అమెరికా)పై నెగ్గారు.  

మిక్స్‌డ్‌లో బోపన్న జోడీ ముందంజ
భారత సీనియర్‌ డబుల్స్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న ఉక్రెయిన్‌కు చెందిన నదియా కిచెనొక్‌తో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. తొలిరౌండ్లో భారత్‌–ఉక్రెయిన్‌ జోడి 7–5, 4–6, 10–6తో క్రాజిసెక్‌ (అమెరికా)– లైడ్మిలా కిచెనొక్‌ (ఉక్రెయిన్‌) జంటపై గెలిచింది. రెండో రౌండ్లో బోపన్న–నదియా ద్వయం... నికోల్‌ మెలిచర్‌ (అమెరికా)–బ్రూనో సోరెస్‌ (బ్రెజిల్‌) జంటతో తలపడుతుంది. నిజానికి బోపన్న హైదరాబాదీ స్టార్‌ సానియా మీర్జాతో జోడీ కట్టాలనుకున్నాడు. కానీ ఆమె గాయంతో ని్రష్కమించడంతో ఉక్రెయిన్‌ భాగస్వామితో కలిసి ఆడుతున్నాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement