‘అందులో ఐపీఎల్‌ కంటే పీఎస్‌ఎల్‌ భేష్‌’ | Sakshi
Sakshi News home page

‘అందులో ఐపీఎల్‌ కంటే పీఎస్‌ఎల్‌ భేష్‌’

Published Fri, Jun 5 2020 11:23 AM

Quality Of Bowling In PSL Lot Better Than IPL, Wasim Akram - Sakshi

కరాచీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ క్రికెట్‌ లీగ్‌ల్లో కచ్చితంగా ఐపీఎల్‌దే టాప్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఐపీఎల్‌ పుట్టుక మొదలు ఇప్పటివరకూ ఆ క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు ఆదరణ అంతకంతకూ పెరుగుతూనే పోతుంది కానీ ఎక్కడ దాని క్రేజ్‌ తగ్గిన దాఖలాలు లేవు. విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌ ఆడటానికి ఎక్కువ మొగ్గుచూపుతున్నారంటే ఆ లీగ్‌ గురించి వేరే చర్చ కూడా అనవసరం. అయితే పాకిస్తాన్‌ దిగ్గజ బౌలర్‌ వసీం అక్రమ్‌ మాత్రం పీఎస్‌ఎల్‌ను ఐపీఎల్‌తో పోల్చకూడదంటూనే తమ లీగ్‌పై ప్రేమ కురిపించాడు. ప్రధానంగా నాణ్యమైన బౌలింగ్‌ అంశానికొస్తే ఐపీఎల్‌ కంటే పీఎస్‌ఎలే ఉత్తమం అని అక్రమ్‌ చెప్పుకొచ్చాడు. ఇది తన అభిప్రాయం కాదని, కొంతమంది విదేశీ ఆటగాళ్లు తనతో చెప్పిన మాటనే చెబుతున్నానని అక్రమ్‌ స్పష్టం చేశాడు.(ముష్ఫికర్‌కు ‘నో’ చెప్పిన బీసీబీ )

‘గత కొన్నేళ్లుగా పీఎస్‌ఎల్‌ను సీరియస్‌గా గమనిస్తున్నా. దానిలో భాగంగానే చాలా మంది విదేశీ ఆటగాళ్ల అభిప్రాయం కూడా తెలుసుకున్నా. ఐపీఎల్‌కు పీఎస్‌ఎల్‌కు ఉన్న తేడా ఏమిటి అని అడిగా. వారంత ఐపీఎల్‌లో నాణ్యమైన బౌలింగ్‌ లేదనడమే కాకుండా పీఎస్‌ఎల్‌లో ఒక క్వాలిటీ బౌలింగ్‌ ఉందన్నారు. ప్రత్యేకంగా బౌలింగ్‌ విషయంలో ఐపీఎల్‌ కంటే పీఎస్‌ఎల్‌ ఎంతో ముందంజలో ఉందని వారు చెప్పారు’ అని మాజీ క్రికెటర్‌ బాసిత్‌ ఆలీతో యూట్యూబ్‌ చాట్‌లో అక్రమ్‌ పేర్కొన్నాడు. 

పీఎస్ఎల్‌ను ఐపీఎల్‌తో పోల్చలేం..
ఏది ఏమైనా పీఎస్‌ఎల్‌ను ఐపీఎల్‌తో పోల్చలేమని మరొక ప్రశ్నకు సమాధానంగా అక్రమ్‌ చెప్పాడు. ‘పీఎస్‌ఎల్‌ అనేది ఇప్పుడిప్పుడు వెలుగు చూస్తున్న లీగ్‌. ఐపీఎల్‌కు ఎప్పుడో ఒక గొప్ప వైభవం వచ్చేసింది. ఐపీఎల్‌ పుట్టి 12 ఏళ్లు అయ్యింది. పీఎస్‌ఎల్‌ అనేది ఇంకా ఐదేళ్ల బాలుడే. పీఎస్‌ఎల్‌కు అంకురార్పణ జరిగినప్పుడు ఇంత పెద్ద లీగ్‌ ఎలా నిర్వహిస్తారనుకున్నా. ఇప్పుడు ఆ లీగ్‌ వరల్డ్‌లో రెండో అతి పెద్ద టోర్నమెంట్‌గా ఉంది. ఐపీఎల్‌ తర్వాత స్థానం కచ్చితంగా పీఎస్‌ఎల్‌’అని అక్రమ్‌ తెలిపాడు. ఇక ఐపీఎల్‌ అతి పెద్ద క్యాష్‌ రిచ్‌ లీగ్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. పీఎస్‌ఎల్‌లో పలు ఫ్రాంచైజీలతో కలిసి పని చేశాడు. అందులో ఇస్లామాబాద్‌ యునైటెట్‌, కరాచీ కింగ్స్‌లు ఉ‍న్నాయి. గత కొన్నేళ్లుగా కరాచీ కింగ్స్‌కు అక్రమ్‌ సేవలందిస్తున్నాడు. ఇక ఐపీఎల్‌లో 2016 వరకూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా అక్రమ్‌ కొనసాగాడు.(విదేశాల్లో ఐపీఎల్‌2020? బీసీసీఐ సమాలోచన)

Advertisement
 
Advertisement