సింధు జోరుకు బ్రేక్‌ | PV Sindhu crashes out of China Open | Sakshi
Sakshi News home page

సింధు జోరుకు బ్రేక్‌

Sep 20 2019 4:53 AM | Updated on Sep 20 2019 5:16 AM

PV Sindhu crashes out of China Open - Sakshi

చాంగ్‌జౌ (చైనా): ప్రపంచ చాంపియన్‌ హోదాలో... మరో ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్‌ టైటిల్‌ లక్ష్యంగా చైనా ఓపెన్‌లో అడుగుపెట్టిన పీవీ సింధు ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ర్యాంకింగ్స్‌లో తన కంటే కింది స్థానంలో ఉన్న పొర్న్‌పవీ చొచువోంగ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడి నిరాశ పరిచింది. గురువారం జరిగిన వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో సింధు 21–12, 13–21, 19–21తో ప్రపంచ 15వ ర్యాంక్‌ షట్లర్‌  చొచువోంగ్‌ చేతిలో కంగుతింది.   

ఆధిక్యం ప్రదర్శించినా...
ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా చొచువోంగ్‌పై సింధు విజయం ఖాయం అని అందరూ అనుకున్నారు. దీనికి తగ్గట్లే చక్కటి స్మాష్‌లతో విరుచుకుపడ్డ సింధు... వరుసగా పాయింట్లు సాధించి 21–12తో తొలి గేమ్‌ను గెల్చుకుంది. రెండో గేమ్‌ నుంచి మాత్రం సీన్‌ రివర్స్‌ అయింది. అనూహ్యంగా గాడి తప్పిన సింధు ఆట ప్రత్యర్థికి వరంలా మారింది. వరుసగా 5 పాయింట్లు సాధించిన చొచువోంగ్‌ 5–1తో, ఆ తర్వాత మరోసారి వరుసగా ఆరు పాయింట్లు కొల్లగొట్టి 15–7తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది.

ఈ పట్టును నిలుపుకున్న  థాయ్‌లాండ్‌ షట్లర్‌ రెండో గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇది ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో  తొలి 12 పాయింట్ల తర్వాత ఇద్దరూ సమంగా నిలిచారు. ఈ దశలో సింధు వరుసగా పాయింట్లు సాధిస్తూ 19–15తో ఆధిక్యంలో నిలిచింది. విజయానికి కేవలం రెండు పాయింట్ల దూరంలో ఉన్న సమయంలో థాయ్‌ అమ్మాయి అనూహ్యంగా పుంజుకుంది. చొచువోంగ్‌ వరుసగా 6 పాయింట్లు సాధించి సింధు కళ్ల ముందే మ్యాచ్‌ను లాగేసుకుంది.  

క్వార్టర్స్‌లో సాయి ప్రణీత్‌
పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్‌ 21–19, 21–19తో లూ గాంగ్‌ జూ (చైనా)పై విజయం సాధించి క్వార్టర్స్‌లో ప్రవేశించాడు. మరో భారత అటగాడు పారుపల్లి కశ్యప్‌ 21–23, 21–15, 12–21తో ఆంథోని సింసుక గింటింగ్‌ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడాడు.

డబుల్స్‌లోనూ నిరాశే..
డబుల్స్‌ విభాగాల్లో పోటీ పడుతున్న భారత జోడీలు రెండో రౌండ్లో ఓడి నిరాశ పరిచాయి. పరుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి (భారత్‌) 19–21, 8–21తో తకెషి కముర– కిగో సొనొడ (జపాన్‌) చేతిలో వరుస గేమ్‌లలో చిత్తయ్యారు. అనంతరం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ సాత్విక్‌ సాయిరాజ్‌– అశ్విని పొన్నప్ప ద్వయం 11–21, 21–16, 12–21తో ప్రపంచ నాలుగో ర్యాంక్‌ యూకి కనెకొ– మిసాకి మట్సుటొమొ (జపాన్‌) జంట చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి– అశ్విని పొన్నప్ప జోడి 12–21, 17–21తో మిసాకి మట్సుటొ మొ– అయక తకహాషి (జపాన్‌) చేతిలో ఓడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement