మొదటి రోజు...మనదే జోరు

Pujara and Agarwal take India Day 1 in Sydney  - Sakshi

పుజారా అజేయ శతకం

మయాంక్‌ అగర్వాల్‌ అర్ధ సెంచరీ

 రాణించిన విహారి

తొలి రోజు భారత్‌ 303/4

ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు 

టీమిండియా చారిత్రక విజయానికి బలమైన పునాది పడింది... దశాబ్దాల కల నెరవేరేందుకు చక్కటి మార్గం దొరికింది... భారత క్రికెట్‌కే కలికితురాయిగా నిలిచే గెలుపును సొంతం చేసుకునేందుకు సరైన ఆరంభం లభించింది. దానిపై కొత్త అధ్యాయం లిఖించే దిశగా కోహ్లి సేన అడుగులు వేస్తోంది.

ఆడుతున్నది సిడ్నీలోనా? లేక సొంతగడ్డ పైనా? అన్నట్లుగా సాగిన బ్యాటింగ్‌ సురక్షిత స్థితికి చేర్చింది.  చతేశ్వర్‌ పుజారా అజేయ శతకం, యువ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ దూకుడైన అర్ధ శతకంతో మన జట్టును పైమెట్టున నిలిపారు.

 ఇకచేయాల్సింది.. ఈ పట్టును మరింత బిగించడం! శుక్రవారం స్కోరును ప్రత్యర్థి అందుకోలేనంతగా పైపైకి తీసుకెళ్లడం. పుజారాకు తోడుగా క్రీజులో ఉన్న ఆంధ్ర బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి, ఆ తర్వాత వచ్చే పంత్, జడేజా ఆ బాధ్యతను సమర్థంగా నెరవేరిస్తే చాలు... మిగతా పని బౌలర్లు చూసుకుంటారు.  

సిడ్నీ : వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ పుజారా (250 బంతుల్లో 130 బ్యాటింగ్‌; 16 ఫోర్లు) మరోసారి సెంచరీ బాదడం, ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (112 బంతుల్లో 77; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో అదరగొట్టడంతో సిడ్నీ టెస్టును తొలి రోజే టీమిండియా తనవైపు తిప్పుకొంది. వీరిద్దరితో పాటు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి (58 బంతుల్లో 39 బ్యాటింగ్‌; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడటంతో ఆస్ట్రేలియాతో గురువారం ఇక్కడ ప్రారంభమైన నాలుగో టెస్టులో ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (9) పేలవ ఫామ్‌ కొనసాగగా, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (59 బంతుల్లో 23; 4 ఫోర్లు), వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే (55 బంతుల్లో 18; 1 ఫోర్‌) భారీ స్కోర్లు సాధించడంలో విఫలమయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో హాజల్‌వుడ్‌ (2/51) రెండు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్, కమిన్స్, లయన్‌ ఆకట్టుకోలేకపోయారు.

మయాంక్‌ మళ్లీ... 
భారత్‌ను టాస్‌ రూపంలో అదృష్టం వరించింది. దీంతో మరో ఆలోచన లేకుండా కోహ్లి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. కానీ, శుభారంభం మాత్రం దక్కలేదు. రెండు ఫోర్లు కొట్టిన రాహుల్‌... ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే హాజల్‌వుడ్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో షాన్‌మార్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఇక్కడినుంచి మయాంక్, పుజారా ఇన్నింగ్స్‌ను నడిపించారు. పుజారా 12 పరుగుల వద్ద ఉన్నప్పుడు కమిన్స్‌ బౌలింగ్‌లో కీపర్‌ క్యాచ్‌ కోసం ఆస్ట్రేలియా అప్పీల్‌ చేసింది. అంపైర్‌ తిరస్కరించగా రివ్యూకు వెళ్లింది. అయితే రీప్లేలో బ్యాట్‌కు బంతి తగల్లేదని తేలింది. లంచ్‌ సమయానికి భారత్‌ స్కోరు 69/1కు చేరింది. విరామం అనంతరం స్టార్క్‌ బంతిని కవర్స్‌లో బౌండరీకి పంపి మయాంక్‌ అర్ధశతకం (96 బంతుల్లో) అందుకున్నాడు. మరింత దూకుడు చూపిన అగర్వాల్‌.. లయన్‌ను లక్ష్యంగా చేసుకుని రెండు సిక్స్‌లు బాదాడు. ఈసారి సెంచరీ చేయడం ఖాయం అనుకుంటున్న దశలో లయన్‌ బౌలింగ్‌లోనే భారీ షాట్‌కు యత్నించి లాంగాన్‌లో స్టార్క్‌కు చిక్కాడు.

రెండో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. పుజారా–కోహ్లి జోడి సులువుగా పరుగులు సాధించింది. ఈ క్రమంలోనే లబషేన్‌ ఓవర్లో ఫోర్‌తో పుజారా అర్ధ సెంచరీ (134 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. 177/2తో భారత్‌ టీ బ్రేక్‌కు వెళ్లింది. మూడో సెషన్‌ తొలి ఓవర్లోనే కోహ్లి ఔటయ్యాడు. లెగ్‌సైడ్‌ వెళ్తున్న హాజల్‌వుడ్‌ బంతిని వెంటాడిన అతడు కీపర్‌ పైన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. మూడో వికెట్‌కు వీరిద్దరు 54 పరుగులు జత చేశారు. రహానే సౌకర్యవంతంగానే కనిపించినా... తప్పించుకోలేనట్లుగా స్టార్క్‌ సంధించిన అద్భుతమైన బౌన్సర్‌ అతడి ఇన్నింగ్స్‌ను ముగించింది. అనంతరం విహారి... పుజారాకు మంచి సహకారం అందిం చాడు. బ్యాక్‌ఫుట్‌పై గల్లీ దిశగా, స్క్వేర్‌ డ్రైవ్‌తో, కవర్స్‌లో చక్కటి షాట్లతో ఫోర్లు కొట్టాడు. మరోవైపు స్టార్క్‌ బంతిని ఫైన్‌లైగ్‌లో బౌండరీకి పంపి పుజారా శతకం (199 బంతుల్లో) అందుకున్నాడు. రెండో కొత్త బంతిని సైతం సమర్థంగా ఎదుర్కొన్న వీరిద్దరూ ఐదో వికెట్‌కు అభేద్యంగా 75 పరుగులు జోడించి రోజును ముగించారు.

శతేశ్వర్‌ పుజారా
ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లు ఒక్కోసారి ఒక్కో ఆటగాడిని కెరీర్‌ ఉన్నత స్థాయిలో నిలుపుతాయి. ఈ శతాబ్దంలో భారత్‌ విషయానికొస్తే... 2003–04లో రాహుల్‌ ద్రవిడ్, 2014–15లో విరాట్‌ కోహ్లి ఇలానే మెరిశారు. ప్రస్తుత సిరీస్‌లో ఆ వంతు చతేశ్వర్‌ పుజారాకు వచ్చింది. నమ్మకమైన బ్యాట్స్‌మనే అయినా, పెద్దగా అంచనాల్లేకుండానే ఆస్ట్రేలియా వచ్చిన అతడు టెస్టు టెస్టుకు మరింత ఎత్తుకు ఎదిగాడు. ఏకంగా మూడు సెంచరీలు బాదాడు. అన్నీ ఉత్తమమే అయినా, సిడ్నీలో చేసిన తన కెరీర్‌ 18వ శతకం మిగతావాటి కంటే గొప్ప. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన అతను రోజంతా నిలిచి జట్టును భద్రమైన స్థితికి చేర్చాడు. పనిలోపనిగా తనపై వచ్చే ప్రధాన విమర్శ అయిన ‘తక్కువ స్ట్రయిక్‌ రేట్‌’ను సవరించాడు. గురువారం అన్ని ప్రధాన భాగస్వామ్యాల్లో పాలుపంచుకున్న పుజారా జట్టు మొత్తం స్కోరులో దాదాపు 45 శాతం పరుగులు చేయడం విశేషం. ముందు క్రీజులో కుదురుకుని... పిచ్‌పై పేస్, బౌన్స్‌ను అర్ధం చేసుకున్నాక స్కోరింగ్‌ రేట్‌ను పెంచిన తీరు ముచ్చటగొలిపింది. ఇందులో అతడి ఆటను మూడు భాగాలుగా చెప్పుకోవాలి.

ఓవైపు పేసర్లు సహా స్పిన్నర్‌ లయన్‌ను అలవోకగా ఎదుర్కొంటూ పరుగులు పిండుకుంటున్న యువ బ్యాట్స్‌మన్‌ మయాంక్‌కు అండగా నిలుస్తూ లంచ్‌ వరకు 59 బంతుల్లో 16 పరుగులే చేసిన పుజారా... కోహ్లి జత కలిశాక ఇన్నింగ్స్‌ బాధ్యత తీసుకున్నాడు. ముఖ్యంగా మూడు ఫోర్లతో లబషేన్‌ బౌలింగ్‌పై పుజారా విరుచుకుపడిన తీరు టి20 తరహా దూకుడును తలపించింది. లంచ్‌–టీ మధ్య అతడు 79 బంతుల్లోనే 45 పరుగులు చేయడం గమనార్హం. టీ తర్వాత కోహ్లి, రహానే ఔటైన పరిస్థితుల్లోనూ విహారితో కలిసి సడలని పట్టుదల చూపాడు. క్రీజు వదిలి ముందుకొస్తూ లయన్‌ను ఎదుర్కొన్న తీరు పుజారా ఇన్నింగ్స్‌లో హైలైట్‌. దీంతో లయన్‌ ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడ్డాడు. చతేశ్వర్‌ ధాటికి... ఏరికోరి తీసుకున్న రెండో స్పిన్నర్‌ లబషేన్‌తో ఆసీస్‌ వరుసగా ఓవర్లు వేయించే సాహసం చేయలేకపోయింది.

కొసమెరుపు: సాధారణంగా శతకం తర్వాత పెద్దగా సంబరాలు జరుపుకోకుండా బ్యాట్‌ పైకెత్తి సావధానమైన అభివాదం చేయడం పుజారా శైలి. సిడ్నీలో మాత్రం దానికి భిన్నంగా... అమితానంద భావోద్వేగంతో గాల్లోకి పంచ్‌ ఇవ్వడం అతని దృష్టిలో ఈ ఇన్నింగ్స్‌ ప్రాధాన్యతను చూపిస్తోంది. 

నలుపు బ్యాండ్‌లతో... 
సిడ్నీ టెస్టులో ఇరు జట్ల ఆటగాళ్లు భుజాలకు నలుపు రంగు బ్యాండ్‌లను ధరించి మైదానంలోకి దిగారు. బుధవారం కన్నుమూసిన ప్రముఖ కోచ్‌ రమాకాంత్‌ అచ్రేకర్‌కు సంతాప సూచకంగా భారత క్రికెటర్లు... ఇటీవల మరణించిన ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ బిల్‌ వాట్సన్‌కు నివాళిగా ఆ జట్టు ఆటగాళ్లు బ్యాండ్‌లు ధరించి తమ గౌరవాన్ని ప్రదర్శించారు. మరో వైపు ‘పింక్‌ టెస్టు’కు మద్దతుగా విరాట్‌ కోహ్లి కూడా తన గ్లవ్, బ్యాట్‌ గ్రిప్‌లతో పాటు బ్యాట్‌పై ఉన్న ‘ఎంఆర్‌ఎఫ్‌’ లోగోను కూడా గులాబీ రంగులోకి మార్చి బ్యాటింగ్‌కు రావడం అందరినీ ఆకర్షించింది.   

మైదానంలో మరో ‘వా’ 
ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్‌ వా సిడ్నీ మైదానంలోనే భారత్‌తో తన ఆఖరి టెస్టు ఆడి సరిగ్గా 15 ఏళ్లయింది. ఇప్పుడు మరో ‘వా’ ఇక్కడే ఆసీస్‌ జట్టు సభ్యుడిగా మైదానంలో కనిపించాడు. నాలుగో టెస్టు కోసం ఆస్ట్రేలియా ప్రకటించిన ‘ఎమర్జెన్సీ ఫీల్డర్ల’ జాబితాలో స్టీవ్‌ వా తనయుడు అస్టిన్‌ వా కూడా ఉన్నాడు. టెస్టు తుది జట్టులో స్థానం దక్కని ఆటగాడిని వెంటనే దేశవాళీ క్రికెట్‌ కోసం పంపించి... స్థానిక క్రికెటర్లను జట్టు అదనపు సభ్యులుగా తీసుకోవడం ఆస్ట్రేలియాతో తరచుగా జరిగేదే. సబ్‌స్టిట్యూట్‌గా కూర్చున్న అస్టిన్‌ విరామం సమయంలో మైదానంలోకి వచ్చి తమ ఆటగాళ్లకు డ్రింక్స్‌ అందించాడు. అస్టిన్‌ అండర్‌–19 ప్రపంచకప్‌ ఆడాడు.   

భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకున్నందుకు నిరాశగా ఉంది. అయితే నేను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాను. ఇవే తప్పులు పునరావృతం చేయరాదని భావిస్తున్నా. లయన్‌పై ఆధిపత్యం ప్రదర్శించాలని ముందే అనుకున్నా. ఆ వ్యూహం బాగా పని చేసింది. అయితే వికెట్‌ అప్పగించడం మాత్రం బాధగా అనిపిస్తోంది. ఆస్ట్రేలియా పేస్‌ బౌలింగ్‌ చాలా పదునుగా ఉంది. వారు వరుసగా బౌన్సర్లతో ఇబ్బంది పెడుతూ ఆడే అవకాశమే ఇవ్వలేదు. పరుగులు వేగంగా రాకపోయినా పర్వాలేదు కానీ వికెట్‌ మాత్రం ఇవ్వరాదని నేను, పుజారా పట్టుదలగా నిలబడ్డాం. ప్రస్తుతం మా జట్టు పటిష్ట స్థితిలో ఉందని చెప్పగలను’ 
- మయాంక్‌ అగర్వాల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top