అంతా నా తలరాత.. : పృథ్వీషా

Prithvi Shaw Says I Accept My Fate With All Sincerity - Sakshi

డోపింగ్‌లో పట్టుబడటంపై షా వివరణ

ముంబై : డోపింగ్‌ టెస్టులో విఫలమై, 8 నెలల నిషేధానికి గురైన ముంబై యువ క్రికెటర్, భారత టెస్టు ఓపెనర్‌ పృథ్వీ షా తన తప్పును అంగీకరించాడు. ఇదంతా తన తలరాతని, దానిని పూర్తిగా గౌరవిస్తానన్నాడు. పృథ్వీషా నుంచి సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షించగా నిషేధిత ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలింది. దీంతో బీసీసీఐ అతనిపై 8 నెలల నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే దీన్ని తాజాగా కాకుండా పాత తేదీ (మార్చి 16)తో విధించడం వల్ల వచ్చే నవంబర్‌ 15వ తేదీతో ఈ నిషేధం ముగుస్తుంది. 

ఈ వ్యవహారంపై పృథ్వీషాపై ట్విటర్‌ వేదికగా సుదీర్ఘ పోస్టుతో వివరణ ఇచ్చుకున్నాడు. ‘నవంబర్‌ 15 వరకు క్రికెట్‌ ఆడలేనని ఈ రోజే తెలిసింది. ఫిబ్రవరిలో జరిగిన ముష్తాక్‌ అలీ టోర్నీలో ముంబై తరఫున ఆడిన నేను తీవ్ర జలుబు, దగ్గుతో బాధపడ్డాను. దీంతో తక్షణ ఉపశమనం కోసం దగ్గుమందు వాడాను. ఆసీస్‌ టూర్‌లో అయిన కాలి గాయం నుంచి త్వరగా కోలుకోవాలనే ఆతృతలో కనీస జాగ్రత్తలు పాటించకుండా కాఫ్‌ సిరప్‌ విషయంలో ప్రోటోకాల్‌ పాటించలేదు. నా తలరాతను నేను అంగీకరిస్తాను. నడుము నొప్పి నుంచి కోలుకోవాలని ప్రయత్నిస్తున్న నాకు ఈ వార్త ఖంగుతినిపించింది. మందుల విషయంలో అథ్లెట్లు ఎంత జాగ్రత్తగా ఉండాలో నా పరిస్థితిని చూసిన వారికి అర్థం అవుతోంది. మనకు అందుబాటులో లభించే మందులైనా, చిన్నదే అయినా ఆటగాళ్లు ప్రొటోకాల్‌ పాటించాల్సిందే. నాకు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. క్రికెటే నా సర్వస్వం... భారత్‌, ముంబై తరపున ఆడటం కంటే నా జీవితంలో మరో గొప్ప విషయం లేదు. దీనిని నుంచి త్వరగా కోలుకోని పునరాగమనం చేస్తాను’  అని పృథ్వీ షా పేర్కొన్నాడు.

షాతో పాటు మరో ఇద్దరు జూనియర్‌ క్రికెటర్లు అక్షయ్, దివ్య గజ్‌రాజ్‌లకు కూడా ఇదే విధమైన నిషేధానికి గురయ్యారు. షా తీసుకున్న దగ్గుమందులో నిషేధిత టెర్బుటలైన్‌ అనే ఉత్ప్రేరకం ఉంది. ఇది ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలో ఉంది. దీనిపై అవగాహన లేకే తీసుకున్న పృథ్వీ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. అంగేట్ర టెస్ట్‌లోనే సెంచరీతో అదరగొట్టిన ఈ యువ సంచలనం.. ఆస్ట్రేలియా పర్యటనలో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో గాయపడి జట్టుకు దూరమయ్యాడు. అనంతరం ఐపీఎల్‌ ఆడినా అవకాశం రాలేదు. ఇక వెస్టిండీస్‌ ఏ పర్యటనలో పాల్గొన్న షా.. నడుపు నొప్పితో మధ్యలోనే వైదొలిగాడు.

చదవండి: డోప్‌ టెస్టులో పృథ్వీ షా  విఫలం 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top