'ఆసియా కప్‌ కచ్చితంగా జరుగుతుంది'

PCB CEO Wasim Khan Says Sri Lanka Or UAE Will Host Asia Cup - Sakshi

ఇస్లామాబాద్‌ : ఈ ఏడాది ఆసియా కప్‌ను సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో శ్రీలంక లేదా యూఏఈలో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సీఈవో వసీం ఖాన్‌ పేర్కొన్నారు. అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ నిర్వహణపై స్పష్టత లేకపోవడంతో ఆ స్థానంలో తాము ఆసియాకప్‌ను నిర్వహించాలని అనుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపాడు. ఇదే సమయంలో ఐపీఎల్‌ నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ ప్రతిపాధన గురించి అడిగిన ప్రశ్నకు వసీం తన సమాధానం దాటవేశాడు.(భజ్జీ పోస్ట్‌: దాదా అదిరిపోయే రిప్లై)

వసీం ఖాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ' ఈ ఏడాది ఆసియా కప్‌ కచ్చితంగా జరుగుతుంది. మా పాక్‌ జట్టు సెప్టెంబర్‌ 2న ఇంగ్లండ్‌ పర్యటనను ముగించుకొని స్వదేశానికి రానుంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌ను సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో నిర్వహించాలనుకుంటున్నాం. ఇందుకోసం కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్న శ్రీలంకలో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఒకవేళ శ్రీలంక బోర్డు అందుకు ఒప్పుకోకుంటే టోర్నీని యూఏఈలో నిర్వహించడానికి రెడీగా ఉన్నాం. ఒకవేళ అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్‌ జరిగే అవకాశాలు లేకుంటే ఆ సమయంలో పాక్‌ జట్టు ఇతర దేశాలతో సిరీస్‌లు ఆడే విధంగా ప్రణాళిక నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే సెస్టెంబర్‌, అక్టోబర్‌లో ఆసియా కప్‌, డిసెంబర్‌లో న్యూజిలాండ్‌తో హోం సిరీస్‌, తర్వత దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు, టీ20లు ఆడేలా ప్రణాళిక రూపొందించాం. నవంబర్‌ నెలలో మాత్రం కరోనాతో అర్థంతరంగా ఆగిపోయిన పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో మిగిలిన మ్యాచ్‌లను పూర్తి చేయనున్నాం.' అంటూ తెలిపారు. (డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్‌కు షాకింగ్‌‌ న్యూస్‌)

కాగా వారం కిందట ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 సీజన్ కోసం తాము ఆసియాకప్‌ను వదులుకోమని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.  ఇంతకుముందే ప్రకటించిన ఆసియాకప్‌ షెడ్యూల్‌ కూడా సెప్టెంబర్‌లోనే ఉండడంతో పీసీబీ ఐపీఎల్‌ నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐపీఎల్‌ కోసం తమ టోర్నీని ఎలా వాయిదా వేసుకుంటామని ప్రశ్నించింది. 'షెడ్యూల్‌ ప్రకారం కాకుండా ఆసియాకప్‌ జరిగేలా చర్చలు సాగుతున్నాయని విన్నాను. కానీ అది సాధ్యం కాదు. కేవలం ఒక్క దేశం కోసం ఈ టోర్నీని ముందుకు జరపడం సరికాదు. అందుకే ఐపీఎల్‌ కోసం మేం వెనక్కితగ్గడమంటూ ఉండదు. అయినా ప్రేక్షకులు లేకుండా టీ20 ప్రపంచకప్‌ కూడా జరిగే అవకాశం ఉంది. లేకపోతే ప్రతీ జట్టు 15 నుంచి 20 మిలియన్‌ డాలర్లు నష్టపోతుంది' అని ఇంతకముందు ప్రకటనలో వసీం ఖాన్‌ స్పష్టం చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top