
చివరి ఓవర్లో నెగ్గిన పాక్
వెస్టిండీస్‌తో జరిగిన రెండో టి20లో పాకిస్తాన్ చివరి ఓవర్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది.
విండీస్‌తో రెండో టి20
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టి20లో పాకిస్తాన్ చివరి ఓవర్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది. ఆరు బంతుల్లో 14 పరుగులు కావాల్సిన దశలో సునీల్ నరైన్ వరుసగా తొలి రెండు బంతుల్లో ఫోర్లు బాది ఉత్కంఠ పెంచాడు. ఆ తర్వాత నాలుగో బంతికి వైడ్ రూపంలో ఒక్క పరుగు వచ్చింది. ఐదో బంతికి నరైన్ అవుట్ కావడంతో పాటు చివరి బంతికి సింగిల్ మాత్రమే తీయడంతో విండీస్ మూడు పరుగుల తేడాతో ఓడాల్సి వచ్చింది. దీంతో నాలుగు టి20ల సిరీస్‌లో పాక్ 2–0తో ఆధిక్యంలో ఉంది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌట్ అయ్యింది. షోయబ్ మాలిక్ (20 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. నరైన్, బ్రాత్‌వైట్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసి ఓడింది. శామ్యూల్ (35 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడాడు. షాదాబ్ ఖాన్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.
కుప్పకూలిన షెహజాద్
విండీస్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో వాల్టన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పరుగు తీసే క్రమంలో పాక్ ఆటగాడు అహ్మద్ షెహజాద్‌ను ఢీకొన్నాడు. అతడి మోకాలు షెహజాద్ మెడకు తాకడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో ఆటగాళ్లలో ఆందోళన నెలకొంది. అంబులెన్స్ కూడా మైదానంలోకి వచ్చినా షెహజాద్‌ను స్ట్రెచర్ ద్వారా పెవిలియన్‌కు తరలించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స తీసుకోవడంతో ప్రమాదం లేదని తేలింది.