IND Vs NZ 2nd T20: పాండ్యా సేనకు పరీక్ష
లక్నో: ఈ కొత్త ఏడాది జోరుమీదున్న భారత్ తొలి సారి కఠిన పరీక్ష ఎదుర్కొంటోంది. వన్డేల్లో క్లీన్‌స్వీప్ చేసిన కివీస్‌తోనే టి20 సిరీస్ ఆరంభ పోరులో కఠిన సవాలు ఎదురైంది. ఇప్పుడు సిరీస్‌లో తప్పక గెలిచి నిలవాల్సిన పరిస్థితిలో టీమిండియా ఉంది. ఈ నేపథ్యంలో ఒత్తిడంతా ఆతిథ్య జట్టుపైనే ఉంది. మరోవైపు న్యూజిలాండ్ ఆల్‌రౌండ్ ప్రతిభతో పుంజుకొని మనకు షాక్ ఇచ్చింది. దీంతో టీమిండియా మరోసారి ఆదమరిస్తే ఈ సారి మ్యాచ్‌ను కాదు... సిరీస్‌నే కోల్పోవాల్సి వుంటుంది. ముఖ్యంగా టాపార్డర్ మెరిపించాలి.
శుబ్‌మన్ గిల్ గత మ్యాచ్‌లో విఫలం కాగా, ఇషాన్ కిషన్ అటు వన్డే, ఇటు టి20ల్లో తీవ్రంగా నిరుత్సాహపరుస్తున్నాడు. ఇటీవల దీపక్ హుడాకు టీమ్ మేనేజ్మెంట్ చెప్పుకోదగ్గ అవకాశాలిస్తున్నా... తను మాత్రం సద్వినియోగం చేసుకోవడం లేదు. ఈ మ్యాచ్‌లో ఇషాన్, హుడా నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. బౌలింగ్‌లో ఉమ్రాన్ మలిక్ పేస్‌తో పాటు వైవిధ్యం కనబర్చాలి. సుందర్‌తో పాటు కుల్దీప్ కూడా స్పిన్‌తో కట్టడి చేస్తే భారత్‌కు ఏ ఇబ్బంది ఉండదు. తొలి మ్యాచ్‌లో ఓడినా నేడు తుది జట్టులో మార్పులేమీ ఉండకపోవచ్చు.
పిచ్–వాతావరణం
వాజ్‌పేయి స్టేడియం బ్యాటింగ్ పిచే. ఇక్కడ భారత్ గతంలో రెండు మ్యాచ్‌ల్లో 190 పైచిలుకు పరుగులు చేసి గెలిచింది. ఉత్తరాది వేదిక కావడంతో మంచు ప్రభావం మరింత ఎక్కువ.
తుది జట్లు (అంచనా)
భారత్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), గిల్, ఇషాన్, త్రిపాఠి, సూర్యకుమార్, సుందర్, దీపక్ హుడా, శివమ్ మావి, కుల్దీప్, అర్‡్షదీప్, ఉమ్రాన్.
న్యూజిలాండ్: సాన్‌ట్నర్ (కెప్టెన్), అలెన్, కాన్వే, చాప్మన్, ఫిలిప్స్, మిచెల్, బ్రేస్‌వెల్, ఇష్‌సోధి, ఫెర్గూసన్, డఫీ, టిక్నర్.