పాక్‌ క్రికెటర్‌ జాతి వివక్ష వ్యాఖ్యలు!

Pakistan Captain Sarfraz Ahmed Racially Abuses South Africa Cricketer - Sakshi

ఒళ్లు మరిచి కామెంట్‌ చేసిన పాక్‌ కెప్టెన్‌

కఠిన చర్యలు ఎదుర్కోనున్న సర్ఫరాజ్‌  అహ్మద్‌

డర్బన్‌ : పాకిస్తాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ మైదానంలో క్రీడాస్పూర్తి మరిచి జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెటర్‌నని, ఓ జట్టు కెప్టెన్‌ అనే సోయి లేకుండా దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ ఆండిల్‌ పెహ్లువాకియా పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించి వివాదంలో చిక్కుకున్నాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ పెహ్లువాకియా దాటికి 203 పరుగులకే కుప్పకూలింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సఫారి జట్టు మళ్లీ పెహ్లువాకియా(69 నాటౌట్‌)నే ఆదుకొని విజయాన్నందించాడు. అయితే సఫారీ ఇన్నింగ్స్‌ 37 ఓవర్‌లో పెహ్లువాకియా బ్యాటింగ్‌తో తీవ్ర అసహనానికి గురైన సర్ఫరాజ్‌ అహ్మద్‌ నోటికి పనిచెబుతూ స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. పెహ్లువికియా బ్యాటింగ్‌ చేస్తుండగా వికెట్ల వెనుక ఉర్దూలో అత్యంత జుగుప్సాకరంగా కామెంట్‌ చేశాడు. ‘ ఏ నల్లోడా.. మీ అమ్మ ఎక్కడ కూర్చుంది. నీకు ఏం కావాలని ఆమెను ప్రార్థించమన్నావ్‌?’ అంటూ ఒళ్లు మరిచి మాట్లాడాడు.

ఈ మాటలు స్టంప్స్‌ మైక్‌లో స్పష్టంగా రికార్డవ్వడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ తరహా వ్యాఖ్యల పట్ల క్రీడా అభిమానులు మండిపడుతున్నారు.  సర్ఫరాజ్‌పై ఐసీసీ కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top