తండ్రి బాటలో..బాక్సింగ్ ఆటలో...

Ninth Class Student Gold Medal In Boxing State Wide - Sakshi

బాక్సింగ్‌లో రాణిస్తున్న హర్మీత్‌ సేఠి  

రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకం  

బెస్ట్‌ సైంటిఫిక్‌ బాక్సర్‌ అవార్డు  

జాతీయ సబ్‌ జూనియర్స్‌కు అర్హత  

ఆ అమ్మాయి పంచ్‌లతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తోంది. పాఠశాల స్థాయిలోనే బాక్సింగ్‌లో రాణిస్తోంది. తండ్రి బాటలో నడుస్తూ... తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటోంది.ఆమే సికింద్రాబాద్‌ సెయింట్‌ ఆన్స్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోన్న హర్మీత్‌ సేఠి. రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకంగెలుచుకున్న హర్మీత్‌... బెస్ట్‌ సైంటిఫిక్‌ బాక్సర్‌ అవార్డు సొంతంచేసుకుంది.

రాంగోపాల్‌పేట్‌: తల్లిదండ్రుల సహకారం, బాక్సింగ్‌ కోచ్‌ ప్రోత్సాహంతో హర్మీత్‌ సేఠి బాక్సింగ్‌లో దూసుకెళ్తోంది. మారేడుపల్లికి చెందిన హర్మీత్‌ తండ్రి హర్మీందర్‌ సింగ్‌ కూడా బాక్సర్‌. ఆయన గతంలో రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొని బహుమతులు అందుకున్నారు. అలాగే బాడీ బిల్డింగ్‌లో మిస్టర్‌ ఇండియా పోటీల్లోనూ పాల్గొన్నారు. ప్రస్తుతం బాక్సింగ్‌ కోచ్‌గా, ఫిటనెస్‌ ట్రైనర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో తండ్రి బాటలో పయణిస్తున్న హర్మీత్‌... బాక్సింగ్‌పై ఆసక్తితో 2016లో జీహెచ్‌ఎంసీ సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులో చేరింది. అక్కడ కోచ్‌ కృష్ణ దగ్గర శిక్షణ తీసుకున్న ఆమె అనేక పతకాలు, అవార్డులు సొంతం చేసుకుంది. 2017లో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో పెద్దపల్లిలో నిర్వహించిన అండర్‌–17 రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో 54 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించింది. ఆ తర్వాత డెహ్రాడూన్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. ఇప్పటికీ మారేడుపల్లిలోని నెహ్రూనగర్‌ పార్కులో జీహెచ్‌ఎంసీ కోచ్‌ కృష్ణ దగ్గరే శిక్షణ తీసుకుంటోంది.  

జాతీయపోటీలకు...  
తెలంగాణ బాక్సింగ్‌ అసోసియేషన్‌ ఆగస్టు 13–15 వరకు ఎల్‌బీ స్టేడియంలో సబ్‌ జూనియర్స్‌ గర్ల్స్‌ రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహించింది. ఇందులో హర్మీత్‌సేఠి ఈ ఏడాది బెస్ట్‌ సైంటిఫిక్‌ బాక్సర్‌ అవార్డు అందుకుంది. అంతేకాకుండా 54 కిలోల విభాగంలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకంసాధించింది. దీంతో ఆమె జాతీయ సబ్‌ జూనియర్స్‌చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. సెప్టెంబర్‌ 2–8 వరకు నాగ్‌పూర్‌లో బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించనున్న పోటీల్లో ఆమె పాల్గొననుంది.

రోల్‌ మోడల్‌.. మేరీకోమ్‌   
బాక్సింగ్‌ రాణి మేరీకోమ్‌ నా రోల్‌ మోడల్‌. మేరీకోమ్‌లా నేనూ భారత్‌కు పతకాలు సాధించి పెట్టాలనేది నా కోరిక. చిన్నప్పటి నుంచే నాకు బాక్సింగ్‌ అంటే ఇష్టం. అందుకే ఇందులోకి వచ్చాను. నా తల్లిదండ్రులు, కోచ్‌ కృష్ణ గారు నన్నెంతోప్రోత్సహిస్తున్నారు.  – హర్మీత్‌ సేఠి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top