సిరాజ్ వచ్చేశాడు.. | Sakshi
Sakshi News home page

సిరాజ్ వచ్చేశాడు..

Published Sat, Nov 4 2017 6:35 PM

New Zealand won the toss and elected to bat first - Sakshi

రాజ్ కోట్:మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా భారత్ తో ఇక్కడ  సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో మ్యాచ్ లోన్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఈ మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను సమం చేయాలని భావిస్తున్న న్యూజిలాండ్ టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ ద్వారా హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్ భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఆకట్టుకున్న సిరాజ్ ఎట్టకేలకు భారత్ జట్టులోకి చోటు దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ తో టీ 20 సిరీస్ కు ఎంపికైన సిరాజ్ కు తొలి టీ 20లో ఆడే అవకాశం దక్కలేదు. అయితే సిరాజ్ కు రెండో టీ 20 తుది జట్టులో చోటు కల్పిస్తూ టీమిండియా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. తన కెరీర్ లో ఇప్పటివరకూ 16 టీ 20 మ్యాచ్ లు ఆడిన సిరాజ్ 26 వికెట్లను సాధించాడు.

ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన తొలి మ్యాచ్ లో ఘన విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న విరాట్ సేన.. రాజ్ కోట్ లో జరిగే రెండో టీ 20లో గెలిచి సిరీస్ ను సాధించేందుకు కసరత్తలు చేస్తోంది. కివీస్ తో తొలి టీ 20 లో గెలుపొంది పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన కోహ్లి సేన తమ విజయపరంపరను కొనసాగించేందుకు సమాయత్తమవుతోంది. నేటి మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే ఇంకా మ్యాచ్ ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంటుంది. గత మ్యాచ్ లో సమష్టిగా పోరాడిన టీమిండియా 53 పరుగుల తేడాతో కివీస్ ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ లోనూ ఆపై బౌలింగ్ లోనూ ఆకట్టుకుని కివీస్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అద్భుతమైన గెలుపుతో టీ 20 సిరీస్ కు విరాట్ గ్యాంగ్ స్వాగతం పలికింది. ఇప్పుడు రెండో టీ 20లో కూడా విజయం సాధించి సిరీస్ ను ముందుగానే గెలుచుకునేందుకు టీమిండియా సిద్ధమైంది.

అయితే న్యూజిలాండ్ సైతం భారత్ కు షాకివ్వాలని భావిస్తోంది. రెండో టీ 20లో గెలిచి సిరీస్ ఫలితాన్ని కడవరకూ తీసుకెళ్లాలనే యోచనలో ఉంది. గత మ్యాచ్ లో న్యూజిలాండ్ అన్ని విభాగాల్లోనూ విఫలం కావడంతో దాన్ని అధిగమించే పనిలో పడింది. మరొకవైపు న్యూజిలాండ్ 2014 నుంచి ఒక్క ద్వైపాక్షిక టీ 20 సిరీస్ ను కూడా కోల్పోకపోవడం విశేషం. ఇదిలా ఉంచితే, ఇప్పటివరకూ ఈ స్టేడియంలో కేవలం ఒక అంతర్జాతీయ టీ 20 మాత్రమే జరిగింది. 2013లో ఆసీస్ తో జరిగిన టీ 20 లో భారత్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఇక్కడ జరిగిన రెండు వన్డేల్లోనూ భారత్ ఓటమి పాలుకావడం గమనార్హం. వన్డే ఫార్మాట్ లో ఇంగ్లండ్ (2013), దక్షిణాఫ్రికా(2015)లతో ఈ స్టేడియం వేదికగా తలపడిన రెండు సార్లు టీమిండియా ఓటమి చెందింది.

భారత్ తుది జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్,  చాహల్, బూమ్రా, భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్, మొహ్మద్ సిరాజ్

న్యూజిలాండ్ తుది జట్టు:: కేన్ విలియమ్సన్(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, మ్యాట్ హెన్రీ, టామ్ బ్రూస్, గ్రాండ్ హోమ్, గ్లెన్ ఫిలిప్స్, మున్రో, సాంట్నార్, మిల్నే, నికోలస్, ఇష్ సోధీ

Advertisement
 
Advertisement
 
Advertisement