బౌల్ట్‌ ‘హ్యాట్రిక్‌’

New Zealand win over Pakistan in first ODI - Sakshi

తొలి వన్డేలో పాక్‌పై న్యూజిలాండ్‌ గెలుపు టిక్‌

అబుదాబి: న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ ‘హ్యాట్రిక్‌’తో చెలరేగడంతో పాకిస్తాన్‌తో తొలి వన్డేలో కివీస్‌ 47 పరుగుల తేడాతో గెలుపొందింది. అంతర్జాతీయ క్రికెట్‌లో బౌల్ట్‌కు ఇది తొలి ‘హ్యాట్రిక్‌’ కాగా వన్డేల్లో న్యూజిలాండ్‌ తరఫున మూడోది. గతంలో డానీ మోరిసన్‌ (భారత్‌పై 1999లో), షేన్‌ బాండ్‌ (ఆస్ట్రేలియాపై 2007లో) ఈ ఘనత సాధించారు. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 266 పరుగులు చేసింది.

టేలర్‌ (112 బంతుల్లో 80; 5 ఫోర్లు), లాథమ్‌ (64 బంతుల్లో 68;5 ఫోర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. పాక్‌ బౌలర్లలో షాహిన్‌ అఫ్రిది (4/46), షాదాబ్‌ ఖాన్‌ (4/38) రాణించారు. అనంతరం 267 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలో దిగిన పాకిస్తాన్‌కు 3వ ఓవర్‌లోనే గట్టి దెబ్బ తగిలింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బౌల్ట్‌ (3/54) వరుస బంతుల్లో ఫఖర్‌ జమాన్‌ (1), బాబర్‌ ఆజమ్‌ (0), హఫీజ్‌ (0)లను వెనక్కి పంపడంతో ఆ జట్టు 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ సర్ఫరాజ్‌ (64; 7 ఫోర్లు), ఇమాద్‌ వసీం (50; 2 సిక్స్‌లు) ఏడో వికెట్‌కు 103 పరుగులు జోడించినా లాభం లేకపోయింది. చివర కు పాక్‌ 47.2 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది.  

హఫీజ్‌ యాక్షన్‌పై రచ్చ... 
ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ స్పిన్నర్‌ మొహమ్మద్‌ హఫీజ్‌ బౌలింగ్‌ చేస్తున్న సమయంలో అతని బౌలింగ్‌ శైలి సరిగ్గా లేదని న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ బహిరంగంగా విమర్శించాడు. హఫీజ్‌ శైలిని అనుకరిస్తూ ‘చకింగ్‌’ చేస్తున్నట్లుగా సైగలు చేశాడు. ఈ అంశాన్ని సిరీయస్‌గా తీసుకున్న పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌  విషయాన్ని అంపైర్ల దృష్టికి తీసుకెళ్లాడు. హఫీజ్‌ తన బౌలింగ్‌ యాక్షన్‌ కారణంగా గతంలో మూడుసార్లు సస్పెన్షన్‌కు గురయ్యాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top