పాకిస్తాన్‌కే చెల్లు! | New Zealand beat Pakistan by four runs in first test | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కే చెల్లు!

Nov 20 2018 1:01 AM | Updated on Mar 23 2019 8:04 PM

New Zealand beat Pakistan by four runs in first test - Sakshi

పాకిస్తాన్‌ తమకు మాత్రమే సాధ్యమనిపించే ఆటను మరోసారి చూపించింది. ఇక విజయం లాంఛనమే అనుకుంటున్న దశలో కూడా గెలుపు వాకిట బొక్కబోర్లా పడటం తమకే చెల్లునని మళ్లీ నిరూపించింది. 176 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక దశలో పాక్‌ స్కోరు 147/4... మరో 29 పరుగులు చేస్తే చాలు. టెస్టు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్, కెప్టెన్‌ క్రీజ్‌లో ఉండగా, మరో ప్రధాన బ్యాట్స్‌మన్‌ రావాల్సి ఉంది. కానీ కనీసం బుర్రవాడకుండా ఆడిన షాట్లు, రనౌట్‌తో 24 పరుగులకే జట్టు చివరి 6 వికెట్లు కోల్పోయింది. ‘ఓయ్‌ హోయ్‌’ ట్రోఫీలో అయ్యో అనిపించేలా న్యూజిలాండ్‌కు 4 పరుగుల విజయాన్ని బంగారు పళ్లెంలో పెట్టి అందించింది.   

అబుదాబి: ఏడు నెలల విరామం తర్వాత టెస్టు మ్యాచ్‌ బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగుల ఆధిక్యం కోల్పోయినా... చివర్లో ప్రత్యర్థి గెలుపు దిశగా సాగుతున్నా ఏ దశలోనూ ఆశలు కోల్పోలేదు ఆ జట్టు. పట్టుదలగా పోరాడుతూ మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లి అనూహ్యంగా పాకిస్తాన్‌ను పడగొట్టింది. సోమవారం ఇక్కడ ముగిసిన తొలి టెస్టులో కివీస్‌ 4 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించింది.

176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌటైంది. అజహర్‌ అలీ (136 బంతుల్లో 65; 5 ఫోర్లు), అసద్‌ షఫీఖ్‌ (81 బంతుల్లో 45; 4 ఫోర్లు) రాణించారు. కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న భారత సంతతి లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఎజాజ్‌ పటేల్‌ (5/59) ఐదు వికెట్లతో పాక్‌ను దెబ్బ తీసి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. మరో భారత సంతతి స్పిన్నర్‌ ఇష్‌ సోధి (2/37), మీడియం పేసర్‌ వాగ్నర్‌ (2/27) కూడా పాక్‌ పతనంలో తమవంతు పాత్ర పోషించారు. రెండో టెస్టు 24 నుంచి దుబాయ్‌లో జరుగుతుంది.  

పటేల్‌ జోరు... 
ఓవర్‌నైట్‌ స్కోరు 37/0తో ఆట ప్రారంభించిన పాకిస్తాన్‌ మరో 11 పరుగులు మాత్రమే జోడించి ఎనిమిది బంతుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోవడంతో స్కోరు 48/3 వద్ద నిలిచింది. అయితే ఇద్దరు సీనియర్లు అజహర్, షఫీక్‌ ఆ తర్వాత కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. కివీస్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సంయమనంతో ఆడిన వీరిద్దరు నాలుగో వికెట్‌కు 82 పరుగులు జోడించడంతో పాక్‌ విజయానికి 46 పరుగుల దూరంలో నిలిచింది. అయితే లంచ్‌కు ముందు షఫీక్‌ ఔట్‌ కాగా, విరామం తర్వాత పాక్‌ పతనం వేగంగా సాగింది.

ఏమాత్రం అవకాశం లేని సింగిల్‌కు ప్రయత్నించి బాబర్‌ ఆజమ్‌ (13) రనౌట్‌ కాగా... పరిస్థితిని పట్టించుకోకుండా గుడ్డిగా బ్యాట్‌ ఊపి కెప్టెన్‌ సర్ఫరాజ్‌ (3), ఆసిఫ్‌ (0) వెనుదిరిగారు. ఈ దశలో అజహర్‌ బాధ్యత తీసుకొని ఆటను ముగించకుండా టెయిలెండర్లకు బ్యాటింగ్‌ అవకాశం కల్పించాడు. యాసిర్‌ షా (0), హసన్‌ అలీ (0) సహకరించలేక చేతులెత్తేశారు. తొమ్మిదో వికెట్‌ పడ్డ తర్వాత పాక్‌ మరో 12 పరుగులు చేయాల్సి ఉంది. అయితే, మరో ఏడు పరుగుల తర్వాత ఎజాజ్‌ వేసిన బంతికి అజహర్‌ వికెట్ల ముందు ఎల్బీగా దొరికిపోయాడు. పాక్‌ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. దాంతో కివీస్‌ శిబిరంలో ఒక్కసారిగా సంబరాలు మిన్నంటగా... పాక్‌ బృందం అచేతనంగా ఉండిపోయింది. 

పరుగులపరంగా అతి స్వల్ప విజయాల్లో ఈ మ్యాచ్‌ ఐదో స్థానంలో నిలిచింది. గతంలో ఆస్ట్రేలియాపై విండీస్‌ (1 పరుగు–1993), ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌ (2 పరుగులు–2005), ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా (3 పరుగులు–1902), ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌ (3 పరుగులు–1982) గెలిచాయి.  

గత రెండేళ్లలో పాకిస్తాన్‌ 200లోపు లక్ష్యాన్ని ఛేదించలేకపోవడం ఇది మూడోసారి. 2017 ఏప్రిల్‌లో విండీస్‌పై 188 పరుగుల ఛేదనలో 81కి ఆలౌట్‌ కాగా, అదే ఏడాది సెప్టెంబర్‌లో శ్రీలంకపై 136 పరుగుల ఛేదనలో 114కే కుప్పకూలింది.    

సంక్షిప్త స్కోర్లు  
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 153; పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 227; న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 249; పాకిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌: 171 (58.4 ఓవర్లలో) (అజహర్‌ అలీ 65; అసద్‌ షఫీఖ్‌ 45, ఎజాజ్‌ పటేల్‌ 5/59, ఇష్‌ సోధి 2/37, వాగ్నర్‌ 2/27). 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement