‘చైనా బంధం’ తెంచుకోవాల్సిందే

Ness Wadia Speaks About Sponsorship For IPL - Sakshi

ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌పై నెస్‌ వాడియా

న్యూఢిల్లీ: మన దేశం కోసం, ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం కోసం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో చైనా స్పాన్సర్లతో ఇకపై ఒప్పందాలు చేసుకోరాదని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని నెస్‌ వాడియా అన్నాడు. ఇప్పటికిప్పుడు ఒప్పందాన్ని ఉల్లంఘించడం కష్టం కాబట్టి 2021 నుంచి వాటిని పక్కన పెట్టాలని అతను సూచించాడు. స్వదేశీ కంపెనీలు ఒక్కసారిగా ముందుకు రావడం కష్టమే అయినా... మెల్లమెల్లగా చైనా సంస్థలను పక్కన పెట్టాలని అతను చెప్పాడు. ప్రస్తుతం ఐపీఎల్‌కు చైనా మొబైల్‌ కంపెనీ ‘వివో’ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ‘ఇది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగే తప్ప చైనా ప్రీమియర్‌ లీగ్‌ కాదు. ఎప్పుడైనా మన దేశమే ముందు. ఆ తర్వాత డబ్బు.

నా ఉద్దేశం ప్రకారం చైనా కంపెనీలతో బంధం తెంచుకోవాల్సిందే. వారిని పక్కన పెడితే ఆ స్థానంలో స్పాన్సర్‌షిప్‌ అందించేందుకు పలు భారత కంపెనీలు ముందుకు వస్తాయని నా నమ్మకం. మన కోసం ప్రాణాలర్పిస్తున్న సైనికులను గౌరవించేందుకు ఇదో అవకాశం. కనీసం వచ్చే ఏడాది నుంచైనా చైనా సంస్థల స్పాన్సర్‌షిప్‌ తీసుకోవద్దు. ఇలాంటి సమయంలో దేశం తరఫున నిలవడం మన నైతిక బాధ్యత’ అని నెస్‌ వాడియా వ్యాఖ్యానించాడు. ఐపీఎల్‌లోని ఇతర ఫ్రాంచైజీలు కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. అయితే ప్రభుత్వం నుంచి ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే ఆలోచిస్తామని, అప్పటి వరకు ఇలాంటి విషయంలో వేచి చూడటమే సరైన పద్ధతి అని వారు అభిప్రాయపడ్డారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top