
ముంబై మ్యాజిక్
ఐపీఎల్ ఆరంభంలో వరుస ఓటములతో తీవ్ర ఇబ్బందులుపడ్డ ముంబై ఇండియన్స్ సొంత గడ్డపై మాత్రం తడాఖా చూపుతోంది.
బెంగళూరుపై ఘన విజయం
రాణించిన రోహిత్, పొలార్
గేల్ దూకుడు వృథా
రోహిత్ విశ్వరూపం... పొలార్డ్ మెరుపులు... బౌలర్ల సమయోచిత స్పందన...
వెరసి ముంబై ఇండియన్స్ మ్యాజిక్ చేసింది. పటిష్టమైన బెంగళూరు జట్టుపై అలవోకగా నెగ్గి టోర్నీలో రెండో విజయం సొంతం చేసుకుంది.
ముంబై: ఐపీఎల్ ఆరంభంలో వరుస ఓటములతో తీవ్ర ఇబ్బందులుపడ్డ ముంబై ఇండియన్స్ సొంత గడ్డపై మాత్రం తడాఖా చూపుతోంది. ఓ మోస్తరు బౌలింగ్ లై నప్‌తోనే పటిష్టమైన బెంగళూరును కట్టడి చేసి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. వాంఖడే మైదానంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 19 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్‌పై గెలిచింది. బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది.
కెప్టెన్ రోహిత్ (35 బంతుల్లో 59 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీ చేయగా... పొలార్డ్ (31 బంతుల్లో 43; 6 ఫోర్లు), గౌతమ్ (28 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగారు. దిండా, హర్షల్, ఆరోన్, చాహల్ తలా ఓ వికెట్ పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. గేల్ (24 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కోహ్లి (28 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), పార్థివ్ (19 బంతుల్లో 26; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. బుమ్రా, మలింగ, హర్భజన్ తలా రెండు వికెట్లు తీశారు. రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
చివర్లో విజృంభణ
ఆరంభం నుంచే ఓపెనర్లు డంక్ (15), గౌతమ్ వేగంగా ఆడటంతో ముంబైకి శుభారంభం లభించింది. అయితే నాలుగో ఓవర్‌లో డంక్ అవుటైనా... గౌతమ్ మాత్రం రెండు సిక్సర్లతో ఊపుతెచ్చాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. తర్వాత కూడా గౌతమ్ జోరు మాత్రం తగ్గలేదు. దిండా బౌలింగ్‌లో మూడో సిక్సర్ బాదాడు. అయితే పెద్దగా ప్రభావం చూపలేకపోయిన రాయుడు (9), గౌతమ్, అండర్సన్ (6) వరుస ఓవర్లలో అవుట్ కావడంతో ముంబై 84 పరుగులకు 4 వికెట్లు చేజార్చుకుంది. గౌతమ్, రాయుడు రెండో వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
రోహిత్ కుదురుకోవడానికి సమయం తీసుకుంటే... పొలార్డ్ వచ్చిరాగానే బ్యాట్ ఝుళిపించాడు. వేగంగా బౌండరీలు కొట్టి స్కోరుబోర్డును పరుగెత్తించాడు. దిండా వేసిన 18వ ఓవర్‌లో తొలి సిక్సర్ కొట్టిన రోహిత్.. తర్వాతి ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో రెచ్చిపోయాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 60 బంతుల్లో 97 పరుగులు జోడించడంతో ముంబైకి భారీ స్కోరు సాధ్యమైంది. ఓ దశలో బెంగళూరు బౌలర్లు గతి తప్పడంతో ఎక్స్‌ట్రాల రూపంలో 25 పరుగులు వచ్చాయి.
ఆరంభం అదుర్స్
గేల్ మెరుపు బ్యాటింగ్‌తో బెంగళూరుకు ఘనమైన ఆరంభాన్నిచ్చాడు. సుయల్ మూడో ఓవర్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో విరుచుకుపడి 28 పరుగులు రాబట్టాడు. మలింగ కాస్త కట్టడి చేసినా... గేల్ దుమారంతో పవర్‌ప్లేలో పరుగుల వరద పారింది.
రెండో ఎండ్‌లో కోహ్లి... పొలార్డ్, భజ్జీల బౌలింగ్‌లో చెరో సిక్స్ కొట్టాడు. కానీ 10వ ఓవర్‌లో ఆర్‌సీబీకి పెద్ద షాక్ తగిలింది. హర్భజన్ బంతిని ఆడబోయి గేల్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఎదుర్కొన్న తొలి బంతిని డివిలియర్స్ (9) రివర్స్ స్వీప్‌తో బౌండరీకి తరలించాడు. 12వ ఓవర్‌లో కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను షార్ట్ ఫైన్ లెగ్ వద్ద జారవిడిచిన బుమ్రా 13వ ఓవర్‌లో డివిలియర్స్ వికెట్‌ను తీసి లెక్క సరిచేశాడు. తర్వాత కొద్దిసేపటికే కోహ్లి కూడా అవుటయ్యాడు.
ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్న యువరాజ్ (6) క్రీజులో ఇబ్బందిగా కదిలాడు. సహచరుడు రోసోవ్ (24) సిక్స్‌తో టచ్‌లోకి వచ్చినా... పొలార్డ్ ఫుట్‌బాల్ తరహాలో బంతిని తన్ని యువీని రనౌట్‌గా చేశాడు. చివర్లో రోసోవ్ కాసేపు పోరాడినా ఫలితం లేకపోయింది.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: డంక్ (సి) యువరాజ్ (బి) హర్షల్ పటేల్ 15; గౌతమ్ (సి) పార్థివ్ (బి) ఆరోన్ 30; రాయుడు (బి) దిండా 9; రోహిత్ నాటౌట్ 59; అండర్సన్ (సి) కోహ్లి (బి) చాహల్ 6; పొలార్డ్ రనౌట్ 43; తారే నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 25; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 187.
వికెట్ల పతనం: 1-25; 2-71; 3-77; 4-84; 5-181
బౌలింగ్: స్టార్క్ 4-0-29-0; దిండా 3-0-38-1; హర్షల్ పటేల్ 4-0-28-1; ఆరోన్ 4-0-41-1; చాహల్ 4-0-30-1; యువరాజ్ 1-0-9-0
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (బి) హర్భజన్ 38; పార్థివ్ (బి) హర్భజన్ 26; కోహ్లి (సి) అండర్సన్ (బి) సుయల్ 35; డివిలియర్స్ (బి) బుమ్రా 9; యువరాజ్ రనౌట్ 6; రోసోవ్ (సి) రోహిత్ (బి) మలింగ 24; స్టార్క్ (సి) పొలార్డ్ (బి) మలింగ 5; హర్షల్ (బి) బుమ్రా 6; ఆరోన్ నాటౌట్ 7; దిండా నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 168.
వికెట్ల పతనం: 1-53; 2-94; 3-117; 4-119; 5-132; 6-139; 7-151; 8-159
బౌలింగ్: సుయల్ 3-0-35-1; బుమ్రా 4-0-22-2; హర్భజన్ 4-0-33-2; మలింగ 4-0-29-2; పొలార్డ్ 4-0-37-0; రోహిత్ 1-0-6-0.